
డిజిటల్ యుగంలో పెన్ను, పేపర్‌తో చేతిరాత స్థానాన్ని కంప్యూటర్ కీబోర్డులు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లు ఆక్రమించాయి. అయితే టైపింగ్‌తో పోలిస్తే చేతితో రాయడమే మెదడు చురుకుదనాన్ని, జ్ఞాపకశక్తిని అద్భుతంగా మెరుగుపరుస్తుందని న్యూరోసైన్స్ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. చేతితో రాసే సమయంలో మెదడులోని కదలికలు, దృష్టి, ఎమోషన్స్‌కు సంబంధించిన భాగాలు ఏకకాలంలో ఉత్తేజితమవుతాయి. చేతి వేళ్లను నియంత్రించడం, అక్షరాల రూపాన్ని గుర్తుచేసుకుంటూ కాగితంపై గీయడం వల్ల మెదడులో తీటా, ఆల్ఫా ఫ్రీక్వెన్సీలలో కనెక్టివిటీ పెరుగుతుంది. ఇది కొత్త సమాచారాన్ని మెదడు త్వరగా గ్రహించడానికి, దీర్ఘకాలం గుర్తుపెట్టుకోవడానికి దోహదపడుతుంది. దీనికి భిన్నంగా, టైపింగ్‌లో ఒకే విధమైన కీలను నొక్కడం వల్ల పరిమితమైన న్యూరల్ సర్క్యూట్లు మాత్రమే పనిచేస్తాయి.
క్లాస్‌రూమ్‌లలో లేదా లెక్చర్లు వినేటప్పుడు చేతితో నోట్స్ రాసుకునే విద్యార్థులు సమాచారాన్ని మరింత వేగంగా అర్థం చేసుకోగలరని నిపుణులు చెబుతున్నారు. మాట్లాడేంత వేగంగా చేతితో రాయడం సాధ్యం కాదు కాబట్టి విద్యార్థులు ముఖ్యమైన అంశాలను మాత్రమే అర్థం చేసుకుని, వాక్యాలను కుదించి తమదైన శైలిలో రాసుకుంటారు. దీనివల్ల సమాచారం మెదడులో బలంగా నిక్షిప్తమవుతుంది. అదే టైపింగ్ అయితే విన్న ప్రతి పదాన్ని ఆలోచించకుండా రికార్డు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా చిన్నపిల్లల్లో అక్షరాలను గుర్తించడం, భాషా నైపుణ్యాలు పెంపొందించడంలో చేతిరాత ఎంతో సహాయపడుతుంది. అది సాధారణ రాత అయినా లేదా కర్సివ్ అయినా.. సొంతంగా అక్షరాన్ని రాయడం వల్ల మెదడులో బలమైన సంకేతాలు ఏర్పడతాయి. అవసరమైతే ట్యాబ్లెట్లపై స్టైలస్ వాడి రాసినా పెన్నుతో రాసినట్లే మెదడుకు సమాన ప్రయోజనాలు లభిస్తాయని పరిశోధకులు స్పష్టం చేశారు.
ఈ పరిశోధనల అర్థం టైపింగ్ లేదా కీబోర్డు వాడకాన్ని పూర్తిగా ఆపేయాలని కాదు. పెద్ద డాక్యుమెంట్లు తయారుచేయడానికి.. ఆఫీస్ కమ్యూనికేషన్‌కు టైపింగ్ ఎంతో ముఖ్యమైనది. అయితే విద్యార్థులు, పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు నోట్స్ తయారీకి, విషయాలను గుర్తుపెట్టుకోవడానికి పెన్నుతో రాయడాన్ని కొనసాగించడం అత్యుత్తమమని న్యూరోసైంటిస్టులు సూచిస్తున్నారు.