నరాల బలహీనతకు, శరీర బలానికి కత్తిలాంటి ఫుడ్.. నెలకు ఒక్కసారైనా ఈ కూర తినండి..

రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వట్టి తునకల కూర సంప్రదాయ ఎండు మాంసం వంటకం. ఇందులో ప్రోటీన్, విటమిన్ బి12 వంటి పోషకాలు ఉంటాయి. వట్టి తునకలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి? వాటితో రుచికరమైన కూర ఎలా వండాలి? పోషక విలువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

నరాల బలహీనతకు, శరీర బలానికి కత్తిలాంటి ఫుడ్.. నెలకు ఒక్కసారైనా ఈ కూర తినండి..
Vatti Thunakalu Curry

Updated on: Nov 02, 2026 | 11:41 AM

పచ్చి మాంసంతో చేసే వంటకాలెన్నో ఉన్నప్పటికీ, పూర్వకాలంలో మన పెద్దలు అనుసరించిన ఆహారపు అలవాట్లలో ‘ఎండు మాంసానికి’ ఒక ప్రత్యేక స్థానం ఉండేది. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన వట్టి తునకల కూర (Dried Mutton Curry) కేవలం రుచికరమైన వంటకమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బలవర్ధకమైన ఆహారం. నరాల బలహీనతను తగ్గించడంతోపాటు.. శరీరానికి బలాన్నిస్తుంది. నేటి తరానికి పెద్దగా పరిచయం లేని ఈ సంప్రదాయ వంటకం వెనుక ఉన్న ప్రత్యేకతలు, ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.. వాస్తవానికి.. తాజా మేక లేదా గొర్రె మాంసానికి (మటన్) తగినంత ఉప్పు, పసుపు పట్టించి, వాటిని దండలాగా గుచ్చి ఎండలో పూర్తిగా ఆరబెడతారు. ఇలా వారానికి పైగా ఎండబెట్టిన మాంసపు ముక్కలను ‘వట్టి తునకలు’ అంటారు. వీటిని గాలిచొరబడకుండా భద్రపరుచుకుంటే నెలల తరబడి నిల్వ ఉంటాయి. అవసరమైనప్పుడు టమాటాలు, దోసకాయలు లేదా ఉల్లిపాయలతో కలిపి రుచికరమైన కూరగా వండుకుంటారు.

ఆరోగ్య ప్రయోజనాలు – పోషకాల నిధి:

ఎండబెట్టడం వల్ల మాంసంలోని నీటి శాతం తగ్గి, ప్రొటీన్లు, విటమిన్ బి12 (Vitamin B12) వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. పూర్వకాలంలో మనుషులు అంత గట్టిగా ఉండేవారని నిపుణులు చెబుతున్నారు.

ఒట్టి తునుకలు తినడం వల్ల ఎముకలకు, కండరాలకు బలం చేకూరుతుంది. నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది..

వట్టితునకలు తినడం చిన్నా.. పెద్ద అందరికీ చాలా మంచిది. ప్రసవానంతరం బాలింతలకు త్వరగా శక్తి అందడానికి, శరీరం దృఢంగా మారడానికి ఈ కూరను ప్రత్యేకంగా పెట్టేవారు.

అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కోలుకుంటున్న వారికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

ఈ సంప్రదాయ ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అంది, నీరసం తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వట్టి తునకల కూర తయారీ విధానం:

ముందుగా వట్టి తునకలను శుభ్రం చేసి, వేడి నీటిలో సుమారు అరగంట పాటు నానబెట్టాలి. కుక్కర్‌లో నూనె వేడి చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నానబెట్టిన తునకలను వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి.

తగినన్ని నీళ్లు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా జోడించి కుక్కర్ మూత పెట్టి సుమారు 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చివరగా గ్రేవీ చిక్కబడిన తర్వాత కొత్తిమీరతో అలంకరిస్తే గుమగుమలాడే సంప్రదాయ వట్టి తునకల కూర సిద్ధమవుతుంది. అయితే.. పూర్వకాలంలో ఈ ఎండు మాంసాన్ని మంచిగా తినేవారు అందుకే.. అంత బలంగా ఉండేవారని ఆహార నిపుణులు చెబుతున్నారు.

మాంసం.. ఎండబెట్టే సమయంలో పరిశుభ్రత, సరైన నిల్వ, పూర్తిగా ఉడికించడం చాలా ముఖ్యం. ఉప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిమితంగా తీసుకోవాలి.. అయితే.. ఏమైనా సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us