చికెన్ వండే ముందు ఇలా చేస్తే నీచు వాసన మాటే ఉండదు.. హడావుడి లేకుండా రెస్టారెంట్ స్టైల్ సింపుల్ రెసిపీ

చికెన్ వండేటప్పుడు వచ్చే నీచు వాసనను పూర్తిగా తొలగించి, రెస్టారెంట్ స్టైల్‌లో రుచికరమైన చికెన్ కర్రీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉప్పు, పసుపుతో చికెన్‌ను ముందుగా శుభ్రం చేయడం నుంచి పెరుగుతో గ్రేవీకి ప్రత్యేక రుచి తీసుకురావడం వరకు ఈ సింపుల్ రెసిపీ హాస్టల్ విద్యార్థులు, బ్యాచిలర్లకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

చికెన్ వండే ముందు ఇలా చేస్తే నీచు వాసన మాటే ఉండదు.. హడావుడి లేకుండా రెస్టారెంట్ స్టైల్ సింపుల్ రెసిపీ
Chicken Curry

Updated on: Jun 27, 2026 | 5:02 PM

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులకు చికెన్, మటన్, ఫిష్ లాంటివి ఉండాల్సిందే.. కూర, ఫ్రైగా అలాగే.. పలు రకాలుగా వండుకుని ఇష్టంగా ఆరగిస్తారు. అయితే, చికెన్, మటన్ వంటకాలను అద్భుతమైన రుచితో ఆస్వాదించాలనుకుంటే, వాటికి సరైన విధంగా వండడం చాలా ముఖ్యం.. ఇంట్లో సాంప్రదాయ పద్ధతిలో వండటం ద్వారా.. ఏ నాన్ వెజ్ కర్రీ అయినా.. అద్భుతంగా తయారవుతుంది. ఈరోజు మనం మంచి టేస్టీగా, ఎలాంటి మసాలాలు నూరకుండా, చాలా సింపుల్‌గా ఇంట్లోనే చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.. ముఖ్యంగా హాస్టల్‌లో ఉండే విద్యార్థులు లేదా బ్యాచిలర్ల కోసం ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది.

అద్దిరిపోయే రుచితో కూడిన ఈ చికెన్ కర్రీని తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం..

చికెన్ తయారీకి కావలసినవి:

చికెన్: (కర్రీ కట్‌గా కొట్టించుకోవాలి)

కారం, ఉప్పు, పసుపు, నూనె, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, టమాటా ఒకటి చాలు, కరివేపాకు, పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా లేదా చికెన్ మసాలా పొడి, పెరుగు – కప్పు ..

తయారీ విధానం:

చికెన్ శుభ్రపరచడం, నీచు వాసన తొలగించడం: ముందుగా చికెన్‌ను కర్రీ కట్‌గా కొట్టించి తీసుకోండి. చాలామందికి చికెన్ కర్రీ చేసేటప్పుడు నీచు వాసన వస్తుందని ఫిర్యాదు చేస్తుంటారు. దీనిని నివారించడానికి, చికెన్ కడిగే ముందు కొంచెం ఉప్పును, అలాగే కొంచెం పసుపును తీసుకుని చికెన్ ముక్కలకు బాగా పట్టించండి. ఇలా పట్టించి రెండు నిమిషాలు వదిలేసి, ఆ తర్వాత శుభ్రంగా నీళ్లతో కడిగి నీళ్లు వంపేయండి. ఇలా చేయడం వల్ల చికెన్ నీచు వాసన రాకుండా తాజాగా ఉంటుంది.

మ్యారినేషన్: శుభ్రం చేసి నీళ్లు వంపేసిన చికెన్ లోకి కారం (స్పైసీగా కావాలంటే రెండు – 4 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు), రుచికి సరిపడా ఉప్పు, పసుపు తీసుకుని చికెన్ ముక్కలకు బాగా పట్టించండి. ఇలా కలిపి ఒక 10-15 నిమిషాలు పక్కన ఉంచడం వల్ల చికెన్ ముక్కలు చప్పగా రాకుండా ఉప్పు, కారం బాగా పడతాయి.

తాలింపు సిద్ధం చేయడం: ఇప్పుడు కర్రీ వండడానికి కడాయిని గానీ లేదా పాన్‌ను గానీ తీసుకుని అందులో మూడు-నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె కొంచెం వేడయ్యాక, రెండు బిర్యానీ ఆకులను వేయండి. తర్వాత సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు (సుమారు రెండు మీడియం ఉల్లిపాయలు) వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా ఫ్రై చేయండి.

మసాలాలు వేయడం: ఉల్లిపాయలు వేగిన తర్వాత, ఫ్రెష్‌గా దంచిన అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను, పొడవుగా కట్ చేసిన నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలను, అలాగే ఒక టమాటాను (కొంతమందికి చికెన్ కర్రీలో టమాటా నచ్చదు, అలాంటి వాళ్ళు స్కిప్ చేయవచ్చు) తీసుకుని మరొక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి.

చికెన్ వేసి వేయించడం: ఇప్పుడు మనం కలిపి పెట్టిన చికెన్‌ను వేయండి. చికెన్ వేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి, చికెన్‌ను తీసుకుని ఒక రెండు-మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల చికెన్ అనేది గట్టిగా, పీచులా రాకుండా మంచి సాఫ్ట్‌గా ఉంటుంది.

పొడి మసాలాలు, పెరుగు కలపడం: ఇలా రెండు-మూడు నిమిషాలు మధ్యమధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేశాక, ఇప్పుడు కొంచెం కరివేపాకును, కొంచెం పుదీనా ఆకును, తరిగిన కొత్తిమీర ఆకును తీసుకోండి. ఇందులోనే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి (గరం మసాలా పొడికి బదులుగా చికెన్ మసాలా నైనా వాడుకోవచ్చు) తీసుకుని బాగా కలపండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత, అర కప్పు పెరుగును బాగా కలిపి ఇందులోకి తీసుకోండి. పెరుగు వేయడం వల్ల కర్రీ కొంచెం గ్రేవీగా, చాలా బాగుంటుంది. మీరు గ్రేవీ లా కాకుండా కొంచెం ఫ్రై లా చేసుకోవాలనుకుంటే పెరుగును వేయడం స్కిప్ చేయవచ్చు.

ఉడికించడం: ఇప్పుడు మూత పెట్టి నాలుగు-ఐదు నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించండి. దీనివల్ల చికెన్ ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు చక్కగా పడతాయి. నాలుగు-ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలిపి, చికెన్ ఉడకడానికి, అలాగే గ్రేవీకి సరిపడా నీళ్లను తీసుకోండి. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలంటే ఇక్కడ చూపించిన దానికంటే కొంచెం ఎక్కువ నీళ్లను తీసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ మెత్తగా ఉడికేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడికించండి. మధ్యమధ్యలో కలుపుతూ చికెన్ ముక్కలను ఉడికించండి.

సుమారు 15-20 నిమిషాల తర్వాత చికెన్ ముక్కను తీసుకుని నొక్కి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత, చివరగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. గ్రేవీ కూడా మీడియం థిక్‌నెస్ గా చాలా బాగా వస్తుంది.

అంతే.. ఇలా సింపుల్‌గా చేసుకున్న చికెన్ కర్రీ టేస్ట్ అల్టిమేట్‌గా ఉంటుంది. మీరు కూడా మంచి రుచిగా చికెన్ కర్రీ చేయాలనుకుంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us