
పుల్లపుల్లంగా, కారం కారంగా ఉండే నిమ్మకాయ పులిహోర దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ, సులభమైన సాంప్రదాయ వంటకాల్లో ఒకటి.. ఈ వంటకాన్ని చాలా తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. అయితే, అందరికీ మంచిగా టేస్టీగా పులిహోర చేయడం రాదు.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా.. ఈ పులిహోర అద్భుతంగా తయారవుతుంది.. తయారీ విధానం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..ముందుగా, నిమ్మకాయ పులిహోర కోసం అన్నాన్ని పొడిపొడిగా వండుకోవాలి. అన్నం మెత్తగా ఉండకూడదు, పులిహోర కోసం అన్నం గింజలు విడివిడిగా ఉండేలా చూసుకోవాలి. వండిన అన్నాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసి పూర్తిగా చల్లార్చాలి. అన్నం కొద్దిగా కూడా వేడిగా ఉండకూడదు, లేకపోతే నిమ్మకాయ రసం చేదు రుచిని ఇస్తుంది.
అన్నం చల్లారిన తర్వాత, అందులో సరిపడా ఉప్పు వేయాలి. ఒక పావు కేజీ రైస్ కు మధ్యస్థ పరిమాణంలో ఉన్న రెండు నిమ్మకాయల రసం సరిపోతుంది. నిమ్మకాయల నుండి రసం పిండేటప్పుడు గింజలు లేకుండా చూసుకోవాలి. పిండిన నిమ్మకాయ రసాన్ని, ఉప్పును అన్నంలో వేసి బాగా కలపాలి. అన్నం అంతటా ఉప్పు, నిమ్మకాయ రసం పట్టిన తర్వాత, దీనిని పక్కన పెట్టుకోవాలి.
తరువాత, పులిహోరకు ముఖ్యమైన పోపును సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నిమ్మకాయ పులిహోరకు కొంచెం ఎక్కువ నూనె వేసినా రుచిగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత, ఒక టీస్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, ఒక టీస్పూన్ మినప్పప్పు, పావు టీస్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు మధ్యస్థ మంట మీద బాగా ఎర్రగా వేగాలి, పచ్చిగా ఉంటే రుచి అంతగా ఉండదు. పల్లీలు సగం వేగిన తర్వాత, మూడు ఎండు మిరపకాయలను తుంచి వేయాలి. ఐదు పచ్చిమిరపకాయలను నిలువుగా కోసి వేయాలి, ఇవి పులిహోరతో నంజుకోవడానికి బాగుంటాయి. కొద్దిగా పచ్చి కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ పొడి, అర టీస్పూన్ పసుపు పొడి వేసి బాగా కలపాలి. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
పోపును పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి పోపును అన్నంలో కలిపితే నిమ్మకాయ చేదు అయ్యే అవకాశం ఉంది. పోపు చల్లారిన తర్వాత, నిమ్మకాయ, ఉప్పు కలిపిన అన్నంలో వేసి బాగా కలపాలి. అన్నం అడుగంటిన వరకు పోపు దినుసులు, నూనె బాగా కలిసేలా చూసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, కమ్మనైన నిమ్మకాయ పులిహోర సిద్ధం. ఈ పులిహోరను ఉదయం అల్పాహారంగా లేదా మధ్యాహ్న భోజనంగా ఆస్వాదించవచ్చు. దీనికి బంగాళాదుంప వేపుడు లేదా పల్లి చట్నీ మంచి కాంబినేషన్.. ఇంకా ఎలాంటి కర్రీలు, చట్నీలు లేకుండా కూడా అద్భుతంగా తినొచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి