
సాధారణంగా సమోసా అనగానే బంగాళాదుంపలతో చేసిన పూర్ణమే గుర్తుకొస్తుంది. కానీ పంజాబ్‌లోని ఓ స్వీట్ షాప్‌లో పాలకూర, పనీర్‌తో తయారు చేస్తున్న సమోసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిలో పాలకూర ఆకుపచ్చ రంగును, పనీర్ మెత్తటి రుచిని అందిస్తుంది. మసాలాలు జోడించడంతో ఈ రెండు పదార్థాల కలయిక సమోసాకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.
మైదా – 2 కప్పులు
పాలకూర – ఒక కట్ట
పనీర్ – 200 గ్రాములు
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 2
అల్లం తురుము – 1 టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
కారం – అర టీస్పూన్
ధనియాల పొడి – అర టీస్పూన్
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి సరిపడా
నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
ముందుగా సమోసా పిండి సిద్ధం చేసుకోవాలి: ఒక గిన్నెలో మైదా, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ గట్టిగా ఉండేలా పిండిని కలుపుకోవాలి. తడి వస్త్రంతో కప్పి 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
పాలకూర మిశ్రమం తయారీ: పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత పాలకూర వేసి తేమ తగ్గే వరకు వేయించాలి.
పనీర్ మసాలా తయారీ: ఇప్పుడు పాలకూర మిశ్రమంలో పనీర్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. అనంతరం కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. మిశ్రమాన్ని రెండు మూడు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పూర్ణంగా ఉపయోగించుకోవాలి.
సమోసాలకు ఆకారం ఇవ్వడం: ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను పొడవుగా చపాతీలా ఒత్తి రెండు భాగాలుగా కట్ చేయాలి. ఒక్కో భాగాన్ని కోన్ ఆకారంలో మడిచి, అందులో పాలక్ పనీర్ మిశ్రమాన్ని నింపాలి. అంచులను నీటితో తడిపి బాగా అతికించాలి.
నూనెలో వేయించుకోవడం: కడాయిలో నూనె వేడి చేసి సమోసాలను మీడియం-లో ఫ్లేమ్‌పై నెమ్మదిగా వేయించాలి. బయటివైపు బంగారు రంగులోకి వచ్చి క్రిస్పీగా మారిన తర్వాత తీసేయాలి.
అంతే.. రుచికరమైన పాలక్ పనీర్ సమోసాలు సిద్ధమైపోతాయి. వీటిని పుదీనా చట్నీ, టమాటా సాస్‌తో కలిపి తింటే రుచి మరింత బాగుంటుంది. సాయంత్రం స్నాక్స్‌గా, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా తయారు చేసి పెట్టవచ్చు.