
పనీర్ స్టఫింగ్ కోసం:
150 గ్రాముల పనీర్ (తురిమినది)
ఒక ఉల్లిపాయ (సన్నగా తరిగినది)
3 పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి)
ఒక టీ స్పూన్ కారం
2 టీ స్పూన్ల ధనియాల పొడి
తగినంత ఉప్పు
తాజా పాలకూర ఆకులు
శనగపిండి మిశ్రమం కోసం:
ఒక కప్పు శనగపిండి
ఒక టీ స్పూన్ కారం
ఒక టీ స్పూన్ పసుపు
తగినంత ఉప్పు
అవసరమైనన్ని నీళ్లు
ముందుగా ఒక గిన్నెలో తురిమిన పనీర్ తీసుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ పనీర్‌కు పట్టేలా కలిపితే పకోడీల్లో నింపడానికి రుచికరమైన స్టఫింగ్ సిద్ధమవుతుంది.
ఇప్పుడు మరో గిన్నెలో శనగపిండి తీసుకోవాలి. అందులో కారం, పసుపు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరీ పల్చగా కాకుండా చిక్కగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పాలకూర ఆకులకు పిండి బాగా పట్టి పకోడీలు చక్కగా తయారవుతాయి.
తాజా పాలకూర ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. అనంతరం శుభ్రమైన వస్త్రంతో ఆకులపై ఉన్న నీటిని పూర్తిగా తుడిచేయాలి. ఇప్పుడు ఒక పాలకూర ఆకును తీసుకుని దాని ఒకవైపు కొద్దిగా శనగపిండి మిశ్రమం రాయాలి. మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న పనీర్ స్టఫింగ్ పెట్టి ఆకును మడవాలి. ఇదే విధంగా మిగిలిన ఆకుల్లో కూడా పనీర్ మిశ్రమాన్ని నింపుకోవాలి.
ఇప్పుడు పనీర్ స్టఫింగ్ నింపిన పాలకూర ఆకులను శనగపిండి మిశ్రమంలో పూర్తిగా ముంచాలి. ఆకులన్నింటికీ పిండి సమానంగా పట్టేలా చూసుకోవాలి. అనంతరం వీటిని ఎయిర్ ఫ్రయ్యర్ బాస్కెట్‌లో ఒకదానిపై మరొకటి పడకుండా అమర్చాలి. ఎయిర్ ఫ్రయ్యర్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌కు సెట్ చేసి సుమారు 25 నిమిషాల పాటు ఉడికించాలి. పకోడీలు బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు ఉంచాలి. ఎయిర్ ఫ్రయ్యర్ సామర్థ్యాన్ని బట్టి సమయం కొద్దిగా మారవచ్చు.
అంతే.. ఎంతో రుచికరమైన పాలకూర పనీర్ పకోడీలు సిద్ధమవుతాయి. వీటిని వేడివేడిగా పుదీనా చట్నీ, చింతపండు చట్నీ లేదా మీకు నచ్చిన ఇతర చట్నీలతో కలిపి తినవచ్చు. సాయంత్రం టీ సమయంలోనే కాకుండా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కూడా ఈ వెరైటీ స్నాక్‌ను అందించవచ్చు.