
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం అనేక సహజ పద్ధతులను అన్వేషిస్తున్న వారికి బెండకాయ నీళ్లు ఒక ఆసక్తికరమైన మంచి ఎంపిక.. బెండకాయ, సాధారణంగా మనం కూరగాయగా తింటాం.. ఇంకా పులుసు, ఫ్రై చేసుకుని ఇష్టంగా ఆరగిస్తాం.. బెండకాయను చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఇష్టపడతారు. అయితే.. అలాంటి బెండకాయలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అనేక ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. ఇది శరీరంలో కొన్ని అద్భుతమైన మార్పులను తీసుకువస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బెండకాయలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. బెండకాయ నీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. రెండు లేదా మూడు బెండకాయలను శుభ్రంగా కడిగి, తొడిమలు, చివరి భాగాన్ని కత్తిరించి, నిలువుగా కట్ చేయాలి. ఈ ముక్కలను ఒక గిన్నెలో లేదా జార్‌లో వేసి, అవి మునిగే వరకు నీళ్లు పోసి, రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని వడకట్టి తాగాలి.
బెండకాయ నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. బెండకాయలో ఉండే ఎంజైములు, పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది మధుమేహంతో బాధపడేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగు కదలికలను సులభతరం చేస్తుంది. దీనిలోని జిగురు పదార్థం కడుపులో మంటను, ఎసిడిటీని తగ్గించి, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి బెండకాయ నీళ్లు ఒక సహజమైన పరిష్కారం. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇది కడుపు నిండిన భావనను కలిగించి, అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. తద్వారా కేలరీల వినియోగాన్ని నియంత్రిస్తుంది. ఇది మెటబాలిజంను క్రమబద్ధీకరించి, బరువు తగ్గడానికి దోహదపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా బెండకాయ నీళ్లు చాలా మంచివి. బెండకాయలో ఉండే ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
ఎముకల బలానికి విటమిన్ కె అవశ్యకం, ఇది బెండకాయలో పుష్కలంగా ఉంటుంది. ఇది బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు కీళ్లలో వాపును తగ్గించి, ఆర్థరైటిస్ నుండి రక్షణ కల్పిస్తాయి. గర్భిణులకు బెండకాయ నీళ్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఫోలేట్ గర్భస్థ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యకరమైన పెరుగుదలకు సహాయపడుతుంది. బెండకాయ నీళ్లలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. తేనె కలిపి తాగడం వల్ల యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు మరింత పెరుగుతాయి.
యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఇది రక్తహీమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, ఎర్ర రక్త కణాల సంఖ్యను అభివృద్ధి చేస్తుంది. గొంతు నొప్పి, దగ్గు వంటి సీజనల్ సమస్యలకు కూడా బెండకాయ నీళ్లు ఉపశమనం కలిగిస్తాయి. అతిసారంతో డీహైడ్రేట్ అయిన శరీరానికి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. సాధారణంగా బెండకాయ నీళ్లు చాలా మందికి సురక్షితమైనవి..
ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడానికి ముందుగా వైద్యుడిని సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..