
చపాతీతో గులాబ్ జామున్ చేయడం చాలా సులభం. చపాతీలను మెత్తటి పొడిగా మార్చి, దానికి పాలు, యాలకుల పొడి కలిపి చేసే ఈ వంటకం అచ్చం బయట దొరికే జామున్‌ల లాగే ఉంటుంది. అసలు చపాతీ పిండి ఉండలు విడిపోకుండా ఎలా వేయించాలి? పంచదార పాకం ఎంత జిగురుగా ఉండాలి? అనే ఇంట్రెస్టింగ్ రెసిపీ తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
మిగిలిన చపాతీలు
అర కప్పు పాలు
2 టేబుల్ స్పూన్ల రవ్వ (సూజీ)
చిటికెడు బేకింగ్ సోడా
యాలకుల పొడి, పంచదార (1 కప్పు)
నెయ్యి లేదా నూనె (వేయించడానికి)
కుంకుమపువ్వు, రోజ్ వాటర్ (అందుబాటులో ఉంటే)
తయారీ విధానం:
ముందుగా మిగిలిన చపాతీలను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేయండి.
ఈ పొడికి కొద్దిగా పాలు పోసి మళ్లీ గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో రవ్వ, బేకింగ్ సోడా, యాలకుల పొడి వేసి చపాతీ పిండి కంటే మెత్తగా కలపండి. అవసరమైతే మరికొన్ని పాలు వాడండి.
చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండిని చిన్న చిన్న ఉండలుగా చుట్టండి. ఉండలపై ఎక్కడా పగుళ్లు లేకుండా నునుపుగా ఉండేలా చూసుకోండి.
ఒక పాత్రలో కప్పు పంచదార, కప్పు నీళ్లు పోసి మరిగించండి. పాకం కొద్దిగా జిగురుగా మారిన తర్వాత అందులో యాలకుల పొడి, రోజ్ వాటర్ వేసి పక్కన పెట్టండి.
బాణలిలో నెయ్యి లేదా నూనె వేడి చేసి, తక్కువ మంట మీద చపాతీ ఉండలను బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి.
వేయించిన వెంటనే ఈ ఉండలను గోరువెచ్చని పంచదార పాకంలో వేయండి. కనీసం 3 నుండి 4 గంటల పాటు నానితే మెత్తటి గులాబ్ జామున్ సిద్ధం!
వృధా అనుకున్న చపాతీలతో ఇంత రుచికరమైన స్వీట్ చేయడం నిజంగా అద్భుతం కదా.. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో మీ కుటుంబానికి ఈ స్పెషల్ డెజర్ట్‌ను వడ్డించండి.
పిండి కలిపేటప్పుడు ఒక స్పూన్ పాలపొడి కలిపితే జామున్‌లకు మంచి రుచి, వాసన వస్తాయి.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు.