
Protein Deficiency In Children: శరీర ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషక పదార్థం. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇది అవసరం. శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఈ లోపంతో బాధపడుతుంటారు. అయితే చాలా సందర్భాల్లో పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలను తల్లిదండ్రులు సులభంగా గుర్తించలేరు. ఈ విషయంపై నిపుణులు కొన్ని ముఖ్యమైన వివరాలు తెలియజేస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ విభాగానికి చెందిన డాక్టర్ హిమాన్షు భదాని మాట్లాడుతూ.. పెరుగుతున్న పిల్లల శరీర అభివృద్ధికి ప్రోటీన్ చాలా అవసరం అని చెప్పారు. ఇది కణాల నిర్మాణం, కండరాల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ప్రోటీన్ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అయితే శరీరంలో ప్రోటీన్ తక్కువైతే కొన్ని సమస్యలు కనిపించవచ్చు.
పిల్లల్లో ప్రోటీన్ లోపం ఉంటే వారి కండరాలు సరిగా అభివృద్ధి చెందవు. సాధారణంగా ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉండవచ్చు. అలాగే ఎత్తు పెరుగుదల కూడా సరిగా ఉండదు. రోగనిరోధక శక్తి బలహీనపడటం వల్ల పిల్లలు తరచుగా జలుబు, జ్వరం వంటి సమస్యలకు గురవుతుంటారు. చిన్న వయస్సులోనే చర్మం బలహీనపడటం, జుట్టు రాలటం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అదనంగా పిల్లలు తరచూ అలసటగా, బలహీనంగా అనిపించుకోవచ్చు.
డాక్టర్ హిమాన్షు చెప్పిన ప్రకారం.. పిల్లల్లో ప్రోటీన్ లోపానికి ప్రధాన కారణం సరైన పోషకాహారం తీసుకోకపోవడం. తల్లిదండ్రులు పిల్లల ఆహారంలో ఆకుకూరలు, పప్పులు, పండ్లు వంటి పోషకాలు కలిగిన పదార్థాలను చేర్చకపోతే ప్రోటీన్ లోపం వచ్చే అవకాశం ఉంది. సరైన సమతుల్య ఆహారం లేకపోవడం వల్ల ఏ పిల్లలోనైనా ఈ సమస్య తలెత్తవచ్చు.
పిల్లల రోజువారీ ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తప్పకుండా చేర్చాలి. పాలు, పెరుగు, పప్పులు, గుడ్లు వంటి ఆహారాలు మంచి ప్రోటీన్ వనరులు. మాంసాహారం తీసుకునే పిల్లలకు చికెన్, చేపలు కూడా ఇవ్వవచ్చు.