
ఆహారంలో బ్రేక్ ఫాస్ట్ కు ప్రత్యేక స్థానం ఉంది. రాత్రంతా ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ తో ఆ ఉపవాసాన్ని విరమించడం జరుగుతుంది. అందుకే దీనిని “బ్రేక్ ఫాస్ట్” అని పిలుస్తారు. అయితే, చాలా మందికి బ్రేక్ ఫాస్ట్ అనగానే పూరీ, దోశ, వడ వంటి రుచికరమైన, కానీ నూనె శాతం అధికంగా ఉండే వంటకాలు గుర్తొస్తాయి. వీటి రుచి అమోఘంగా ఉన్నప్పటికీ, వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అధిక నూనెతో కూడిన ఆహారాలు జీర్ణక్రియకు ఆటంకం కలిగించడమే కాకుండా, దీర్ఘకాలంలో స్థూలకాయం, గుండె సంబంధిత సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఉదయం తీసుకునే ఆహారం రోజంతటికీ కావాల్సిన శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి, శరీర క్రియలు సక్రమంగా సాగడానికి బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి. అందుకే ఉదయం కచ్చితంగా ఏదో ఒక ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. సరైన అల్పాహారం శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి, అకస్మాత్తుగా ఆకలి వేయకుండా చూస్తుంది.. తద్వారా అనవసరమైన చిరుతిళ్లను తినకుండా నియంత్రిస్తుంది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డేవిడ్ లుడ్విక్, ఉదయం అల్పాహారంలో కొన్ని రకాల ఆహారాలను భాగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా, ఫైబర్, మాంసకృతులు (ప్రొటీన్) అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీనికోసం ఇక్కడ చెప్పిన ఆహార ఎంపికలు ఉత్తమం..
రాగులు, జొన్నలు, సజ్జలు: వీటితో చేసిన ఇడ్లీ, దోశ లేదా జావ వంటివి మంచి ఎంపికలు. ఇవి పోషకాలతో నిండిన సంపూర్ణ ధాన్యాలు.
అటుకులు: అటుకుల ఉప్మా లేదా పలహారం తేలికైన, పోషకమైన అల్పాహారం.
ఓట్స్: ఓట్స్ తో చేసిన ఉప్మా లేదా ఓట్ మీల్ పాలు, పండ్లతో కలిపి తీసుకోవడం వల్ల ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.
మాంసకృతులు కండరాల నిర్మాణానికి, మరమ్మత్తుకు సహాయపడతాయి. అవి రోజంతా శక్తిని అందించి, ఆకలిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పెరుగు: పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. ఇది ప్రొటీన్ కు కూడా మంచి మూలం.
ఉడకబెట్టిన గుడ్లు: గుడ్లలో ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఉదయం పూట ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకోవడం వల్ల మంచి శక్తి లభిస్తుంది.
పౌష్టికాహార నిపుణుల సూచనల ప్రకారం, బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా పండ్లు, ఆమ్లెట్, బాదం, ఆక్రోట్ (వాల్ నట్స్), క్యారెట్ వంటివాటిని కూడా చేర్చుకోవడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.
పండ్లు: పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజసిద్ధమైన చక్కెరను అందిస్తాయి.
ఆమ్లెట్: ఉప్పు, నూనె తక్కువగా వేసి చేసుకునే ఆమ్లెట్ ప్రొటీన్ కు మంచి మూలం.
బాదం, ఆక్రోట్: ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్, ఇతర సూక్ష్మపోషకాలను అందిస్తాయి.
చివరగా, ఉప్పు, నూనె తక్కువగా ఉండే, ఇంట్లో చేసుకున్న ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం శ్రేయస్కరం. ఇలాంటి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ అలవాట్లు రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..