గుడ్లు, చికెన్, మటన్.. వీటిలో ఏది త్వరగా అరుగుతుంది..? ఈ రిపోర్ట్ చూస్తే నోరెళ్లబెడతారు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోటీన్ జీర్ణశక్తి స్కోరు ప్రకారం.. మనం తినే నాన్ వెజ్ ఆహారాలు జీర్ణం కావడానికి ఒక్కో దానికి ఒక్కో సమయం పడుతుంది. కొన్ని ఆహారాలు తిన్న 2 గంటల్లోనే అరిగిపోతే.. మరికొన్ని మాత్రం కడుపులోని ఆమ్లాలను గంటల తరబడి పీల్చిపిప్పి చేస్తాయి. ఈ లిస్ట్‌లో గుడ్లు టాప్ రేటింగ్‌తో ముందంజలో ఉంటే.. మటన్ మాత్రం జీర్ణవ్యవస్థకు చుక్కలు చూపిస్తుంది. కడుపుకు ఏ ప్రోటీన్ సేఫ్ అనేది తెలుసుకుందాం..

గుడ్లు, చికెన్, మటన్.. వీటిలో ఏది త్వరగా అరుగుతుంది..? ఈ రిపోర్ట్ చూస్తే నోరెళ్లబెడతారు..
Egg Vs Chicken Vs Mutton

Updated on: May 22, 2026 | 7:18 AM

ఈ రోజుల్లో బాడీ ఫిట్‌నెస్, మజిల్ బిల్డింగ్ కోసం చాలా మంది హై-ప్రోటీన్ డైట్‌ను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా మాంసాహారులు తమ శరీరానికి కావలసిన ప్రోటీన్ లోపాన్ని పూరించుకోవడానికి రోజువారీ ఆహారంలో గుడ్లు, చికెన్ లేదా మటన్‌ను భాగం చేసుకుంటారు. అయితే ఎక్కువ ప్రోటీన్ పొందాలనే ఆరాటంలో చాలా మంది రోజుకు 10 నుండి 20 గుడ్లు, లేదా అరకిలో నుండి ముప్పావు కిలో వరకు చికెన్, మటన్ తినేస్తుంటారు. కానీ ఎక్కువ ప్రోటీన్ తినేయడం ఎంత ముఖ్యమో.. అది మన కడుపుకు ఎంత సులభంగా జీర్ణమవుతుందనేది కూడా అంతే ముఖ్యం. జీర్ణక్రియ పరంగా ఈ మూడు ప్రోటీన్లు మన శరీరంపై విభిన్న ప్రభావాలను చూపుతాయి. మరి ఈ మూడింటిలో మన జీర్ణవ్యవస్థ దేన్ని అత్యంత వేగంగా, తేలికగా అరిగించుకోగలదో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

నంబర్ వన్ స్థానంలో గుడ్డు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉపయోగించే ప్రోటీన్ జీర్ణశక్తి స్కోరు ప్రకారం.. అత్యంత వేగంగా మరియు పూర్తిగా జీర్ణమయ్యే ప్రోటీన్ల జాబితాలో గుడ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. దీనికి గూగుల్ హెల్త్ నివేదికల్లో 1.0 రేటింగ్ ఇచ్చారు. అంటే దీనిని అత్యుత్తమమైన ప్రోటీన్‌గా పరిగణిస్తారు. గుడ్డులోని ప్రోటీన్ మనం తిన్న తర్వాత శరీరంలో చాలా త్వరగా విచ్ఛిన్నమై, సులభంగా రక్తంలో శోషించబడుతుంది. సాధారణంగా ఒక పూర్తి గుడ్డు మన కడుపులో పూర్తిగా జీర్ణం కావడానికి కేవలం 2 నుండి 3 గంటల సమయం మాత్రమే పడుతుంది. అందుకే ఇది జీర్ణవ్యవస్థకు అత్యంత తేలికైన ఆహారం.

రెండో స్థానంలో చికెన్ బ్రెస్ట్

గుడ్ల తర్వాత కోడి మాంసం అన్నిటికంటే వేగంగా జీర్ణమవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్ భాగంలో కొవ్వు చాలా తక్కువగా, దాదాపుగా లేనంతగా ఉంటుంది. ఇది లీన్ మీట్ కావడం వల్ల కడుపు దీనిని విచ్ఛిన్నం చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. మీ జీర్ణశక్తి కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ.. ఉడికించిన లేదా గ్రిల్ చేసిన చికెన్ కడుపుకు అస్సలు భారంగా అనిపించదు. దీని ప్రోటీన్ జీర్ణశక్తి స్కోర్ కూడా సుమారు 1.0 ఉంటుంది. చికెన్ పూర్తిగా జీర్ణం కావడానికి 2.5 నుండి 3.5 గంటల సమయం పడుతుంది.

జీర్ణం కావడానికి చుక్కలు చూపించే మటన్

మటన్ లేదా రెడ్ మీట్ అనేది ప్రోటీన్, ఐరన్‌కు చాలా గొప్ప మూలమే అయినప్పటికీ.. ఇది జీర్ణం కావడానికి మాత్రం అత్యంత కష్టమైన ఆహారం. హెల్త్ రిపోర్ట్స్ ప్రకారం.. మటన్‌లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉండటమే కాకుండా.. దీని కండర నారలు చాలా దట్టంగా, సంక్లిష్టమైన అణువులతో కూడి ఉంటాయి. దీనివల్ల వీటిని విచ్ఛిన్నం చేయడానికి మన కడుపులోని ఆమ్లాలు, ఎంజైమ్‌లు చాలా గంటల పాటు నిరంతరం కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల రాత్రిపూట మటన్ తినడం అస్సలు మంచిది కాదు. మటన్ పూర్తిగా జీర్ణం కావడానికి కనీసం 4 నుండి 6 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది.

కాగా ఎక్కువ ప్రోటీన్ బాడీకి అందాలనే ఆశతో కడుపుకు భారం అయ్యేలా ఒకేసారి భారీగా మాంసాహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. మీ జీర్ణక్రియ సాఫీగా సాగాలంటే గుడ్లు, చికెన్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ మటన్ తినాలనుకుంటే మాత్రం జీర్ణవ్యవస్థకు తగినంత సమయం దొరికేలా మధ్యాహ్నం పూట మాత్రమే తినడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us