
రాగుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. నిపుణుల ప్రకారం.. రాగులు (ఫింగర్ మిల్లెట్) అత్యంత పోషకమైన చిరుధాన్యాలు. 100 గ్రాముల రాగులలో సుమారు 344 మి.గ్రా కాల్షియం, 11.2 గ్రాముల డైటరీ ఫైబర్, 7.3 గ్రాముల ప్రొటీన్ ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. ఇంకా బరువు తగ్గడానికి, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. రాగులను ఆహారంలో భాగం చేసుకోవాలని పేర్కొంటారు.. వాస్తవానికి మన పూర్వీకులు రాగులను బాగా తినేవారు.. అందుకే, గట్టిగా ధృఢంగా ఉండేవారు. అయితే.. రాగిపిండితో ఎన్నో పదార్థాలను చేసుకుని తినొచ్చు.. ముఖ్యంగా రాగిపిండితో చేసే లడ్డూలు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే, ఆరోగ్యకరమైన తీపి వంటకం. ఈ రెసిపీ, రాగిపిండిని సులభంగా, రుచికరంగా ఎలా వాడుకోవాలో తెలియజేస్తుంది. రాగిపిండిలో ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని బెల్లంతో కలిపి లడ్డూలుగా చేయడం వల్ల ఆరోగ్యం, రుచి రెండూ సమకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.
పిండి వేయించుకోవడం: ముందుగా ఒక మందపాటి పాన్‌లో 2 టేబుల్‌స్పూన్ల నెయ్యి వేడి చేయాలి. నెయ్యి కరిగాక, అందులో ఒకటిన్నర కప్పుల రాగిపిండి, అర కప్పు సూజీ రవ్వ వేయాలి. రవ్వ ఇష్టం లేని వారు మొత్తం రెండు కప్పుల రాగిపిండిని ఉపయోగించవచ్చు.
నెమ్మదిగా వేయించాలి: మంటను పూర్తిగా తగ్గించి (లో ఫ్లేమ్), పిండిని నిరంతరం కలుపుతూ వేయించుకోవాలి. మంటను హైలో లేదా మీడియంలో పెట్టకూడదు. పిండి కమ్మటి వాసన వచ్చి, రంగు కొద్దిగా మారే వరకు సుమారు 10 నిమిషాల పాటు వేయించాలి. పిండి ఎంత బాగా వేగితే లడ్డూలు అంత రుచిగా ఉంటాయి.
కొబ్బరి కలుపుకోవడం: సుమారు 8 నిమిషాల తర్వాత, పిండి దాదాపుగా వేగినప్పుడు, అర కప్పు ఎండుకొబ్బరి తురుమును వేసి, మరో 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. కొబ్బరిని చివర్లో వేయడం వల్ల అది మాడకుండా ఉంటుంది, సులభంగా వేగుతుంది.
బెల్లం కలపడం: పిండి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, పాన్‌లోనే ఒక కప్పు తురిమిన బెల్లం వేయాలి. రెండు కప్పుల పిండి మిశ్రమానికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లం వీలైనంత మెత్తగా తురుముకోవడం వల్ల వేడికి త్వరగా కరిగిపోతుంది. మిశ్రమాన్ని బాగా కలిపి, మూత పెట్టి పక్కన ఉంచాలి.
జీడిపప్పులు, యాలకులు: మరొక చిన్న పాన్‌లో మిగిలిన 2 టేబుల్‌స్పూన్ల నెయ్యి వేడి చేసి, జీడిపప్పులను గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించాలి. వేయించిన జీడిపప్పులను నెయ్యితో సహా రాగిపిండి మిశ్రమంలో వేయాలి. మంచి సువాసన కోసం నాలుగైదు యాలకులను దంచి అందులో కలపాలి.
మిశ్రమాన్ని కలపడం: మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు మొదట స్పూన్‌తో కలిపి, అది చేత్తో పట్టుకునేంత వేడికి వచ్చిన తర్వాత, చేతులతో బాగా కలపాలి. బెల్లం గడ్డలు ఉంటే నలుపుతూ కలపాలి, అప్పుడు బెల్లం పిండిలో బాగా కలిసిపోతుంది.
లడ్డూలు చుట్టడం: అర కప్పు కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా (ఒక్కో స్పూన్ చొప్పున) మిశ్రమంలో వేసుకుంటూ కలపాలి. పాలు మొత్తం ఒకేసారి పోయకూడదు. మిశ్రమం లడ్డూలు చుట్టడానికి వీలైనంత మెత్తగా తయారైనప్పుడు, కావలసిన పరిమాణంలో లడ్డూలను చుట్టుకోవాలి. పాలకు బదులుగా కరిగించిన నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు. నెయ్యితో చేసిన లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి (దాదాపు 5 రోజుల వరకు పాలు ఉపయోగించిన లడ్డూలు ఫ్రెష్‌గా ఉంటాయి).
ఈ రాగి లడ్డూలు మృదువుగా, రుచికరంగా ఉంటాయి. జీడిపప్పు, కొబ్బరి ముక్కలు మధ్యమధ్యలో తగులుతూ అదనపు రుచిని అందిస్తాయి. బెల్లంతో చేయడం వల్ల ఇవి ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఉపయోగపడతాయి. ఈ రుచికరమైన, పోషకమైన రాగి లడ్డూలను మీరూ ప్రయత్నించి చూడండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..