
మనకు వివిధ రకాల మిరపకాయలు అందుబాటులో ఉంటాయి. అయితే కట్ మిర్చికి సరైన మిరపకాయను ఎంచుకోవడం ముఖ్యం. ఉదాహరణకు కొన్ని లావుగా ఉండే మిరపకాయలు లోపలి వరకు సరిగ్గా వేగవు లేదా వాటి రుచి స్టఫింగ్‌తో సరిగా కలవదు. జలపెనో మిరపకాయలు అందుబాటులో ఉన్నా.. అవి చాలా కారంగా ఉండటంతో పాటు వాటి ఆకారం కట్ మిర్చికి అంతగా సరిపోవు. వాటి లోపల ఖాళీ ఎక్కువగా ఉండటం వల్ల పిండి సరిగ్గా పట్టుకోదు వేయించిన తర్వాత కూడా పిండి అంటుకోదు.
శిషితో మిరపకాయలు కట్ మిర్చికి చాలా అనుకూలం. ఇవి సన్నగా ఉండి లోపల పెద్దగా ఖాళీ లేకుండా ఉండటం వల్ల పిండి, లోపల నింపే మిశ్రమం రెండూ చక్కగా పట్టుకుంటాయి. ఈ మిరపకాయలు కారం తక్కువగా ఉండటంతో పుల్లని స్టఫింగ్‌కు పోటీ ఇవ్వకుండా రుచిని సమతుల్యం చేస్తూ కట్ మిర్చికి సరైన రుచిని అందిస్తాయి.
ముందుగా మిరపకాయలను నిలువుగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ ను ఉపయోగించి వాటి లోపల ఉన్న గింజలు, నారలను జాగ్రత్తగా తీసివేయాలి. ఆ తర్వాత స్టఫింగ్ తయారు చేయడానికి చింతపండు గుజ్జు, శనగపిండి, జీలకర్ర పొడి, ఉప్పు, తగినంత నీటిని కలిపి ఒక చిక్కటి పేస్ట్ ను సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ను కట్ చేసుకున్న మిరపకాయ ముక్కల లోపల నింపాలి.
ఇప్పుడు శనగపిండి, వాము, పసుపు, ఉప్పు, వాటర్ ని కలిపి చిక్కటి బ్యాటర్ పేస్ట్ ని సిద్ధం చేసుకోవాలి. స్టౌవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా వేడి అయ్యే వరకు చూడాలి. తర్వాత స్టఫ్ చేసిన మిరపకాయలను బ్యాటర్ లో పూర్తిగా ముంచి వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వేగిన మిరపకాయలను తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
ఈ మిరపకాయలు చల్లారిన తర్వాత వాటిని 1 నుంచి 2 అంగుళాల ముక్కలుగా కట్ చేసి మళ్ళీ వేడి నూనెలో వేసి కరకరలాడే వరకు వేయించాలి. చివరగా వేగిన మిరపకాయ ముక్కలను తీసి పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చాట్ మసాలా, కొత్తిమీర చల్లి వేడి వేడిగా వడ్డించేయండి.. ఇంతే సింపుల్ ఈ రెసిపీని మీరు ట్రై చేసి కుటుంబంతో కలిసి ఆస్వాదించండి.