
భారతీయ ఆహార సంస్కృతిలో పాలు ఒక విడదీయలేని భాగం. ఉదయం తాగే టీ, కాఫీ నుండి రాత్రి తీసుకునే డెజర్ట్‌ల వరకు ప్రతిదీ పాలతోనే ముడిపడి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉన్న మన తదేశంలో గత మూడు దశాబ్దాలలో తలసరి పాల లభ్యత రెట్టింపు అయింది. అయితే మార్కెట్లో ప్రధానంగా లభించే ఆవు, బర్రె పాలలో ఏది ఎక్కువ పోషకాలను అందిస్తుంది..? ఎవరు దేనిని తాగాలి..? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. పాలలో ఉండే అతి ముఖ్యమైన పోషకం ప్రోటీన్. వీటి శాతాన్ని గమనిస్తే 100 మి.లీ ఆవు పాలలో 3.2 గ్రాముల ప్రోటీన్ ఉండగా.. బర్రె పాలలో అది 4.5 గ్రాములుగా ఉంటుంది. అంటే ప్రోటీన్ పరంగా గేదె పాలు బలమైనవిగా కనిపిస్తాయి. కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా గేదె పాలలో కాల్షియం కూడా 70 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మరియు కండరాల పెరుగుదలకు ఎంతో తోడ్పడుతుంది.
కేవలం ప్రోటీన్, కాల్షియంను మాత్రమే చూసి పాలను ఎంచుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బర్రె పాలు జీర్ణవ్యవస్థపై ఎక్కువ భారాన్ని పెంచుతాయి. ఇందులో కొవ్వు పదార్థం, కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. అథ్లెట్లు, క్రీడాకారులు మాత్రమే దీనిని సులభంగా జీర్ణం చేసుకోగలరు. సాధారణ వ్యక్తులు లేదా తక్కువ శారీరక శ్రమ చేసేవారు బర్రె పాలు తాగడం వల్ల జీర్ణ సంబంధిత ఇబ్బందులు తలెత్తవచ్చు. మరోవైపు ఆవు పాలు చాలా తేలికగా ఉండి సులభంగా జీర్ణమవుతాయి. అందుకే ఇవి చిన్న పిల్లలకు, వృద్ధులకు అత్యంత అనుకూలమైనవి. పోషకాల పరంగా చూస్తే ఆవు పాలలో విటమిన్-ఎ, విటమిన్ బి2 ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో మరియు శక్తి జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి.
ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి, ఎప్పుడూ చురుగ్గా ఉండాలనుకునే అథ్లెట్లకు ఆవు పాలు ఉత్తమ ఎంపిక. ఎందుకంటే ఇందులో గేదె పాలతో పోలిస్తే కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. చివరగా ఆవు, బర్రె పాలు రెండూ ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ మీ వ్యక్తిగత ఆరోగ్య లక్ష్యాలు, పౌష్టికాహార అవసరాలు, మీరు ప్రతిరోజూ చేసే శారీరక శ్రమ ఆధారంగా మీకు సరిపోయే పాలను ఎంచుకోవడం ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..