
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలో ప్రజలు ఇష్టంగా తినే పండ్లలో అరటి పండుకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో అనేక రకాలు ఉన్నప్పటికీ, పసుపు రంగు అరటిపండ్లు విరివిగా లభిస్తాయి. అరటి పండ్లలో పోషకాలు అపారంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం ఇందులో అధికంగా లభిస్తాయి. అరటి పండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఉదాహరణకు, సుమారు 80 గ్రాముల బరువున్న ఒక అరటి పండులో 65 కిలో కేలరీల ఎనర్జీ, 1 గ్రాము ప్రోటీన్, 0.1 శాతం ఫ్యాట్, 16.2 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 1.1 గ్రాముల ఫైబర్, 264 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.
మెరుగైన జీర్ణక్రియ: అరటి పండ్లలో అధికంగా ఉండే పెక్టిన్ పేగు పనితీరును మెరుగుపరుస్తుంది. దీనిలోని ఫైబర్ ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది, శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అధిక ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అరటి పండులోని కార్బోహైడ్రేట్లు సులభంగా జీర్ణం కాని ఆహార పదార్థాలు కూడా జీర్ణం కావడానికి తోడ్పడతాయి. ఇది పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడి, ఫ్యాటీ ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది.
గుండె ఆరోగ్యం – రక్తపోటు నియంత్రణ: అరటి పండ్లలో పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలం. పొటాషియం శరీరంలోని అత్యంత ముఖ్యమైన ఎలెక్ట్రోలైట్లలో ఒకటి. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, శరీరంలో ఫ్లూయిడ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. పొటాషియం రక్తపోటును తగ్గించడమే కాకుండా గుండెపోటు, స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది.
ఆమ్లత నియంత్రణ: పొట్టలో విడుదలయ్యే ఆమ్లాలను అరటిపండ్లు సమతౌల్యం చేస్తాయి. ఇందులో ఉండే లూకోసియానిడిన్ పేగులోని పలుచని పొరను మందంగా చేయడానికి ఉపయోగపడుతుంది, తద్వారా ఆమ్లాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. బాగా పండిన అరటి పండ్లు గుండెల్లో మంట (ఎసిడిటీ) నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
శక్తినిచ్చే గుణం: అరటి పండ్లు శరీరానికి ఎక్కువ కేలరీల శక్తిని అందిస్తాయి. మిగిలిన పండ్లతో పోలిస్తే అరటి పండ్లలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. ఫైబర్‌తో కలిసిన సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి శరీరానికి అత్యవసర శక్తిని త్వరగా అందిస్తాయి, ప్రత్యేకించి శారీరక శ్రమ చేసేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
కండరాల ఆరోగ్యం – ఒత్తిడి తగ్గింపు: కండరాల కదలికలకు, తిమ్మిర్లు తగ్గించేందుకు పొటాషియం ఎంతగానో సహకరిస్తుంది. అరటిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లాన్ని మెదడు సెరటోనిన్‌గా మారుస్తుంది. సెరటోనిన్ మెదడును ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక ఉత్సాహాన్ని కలిగించడానికి తోడ్పడుతుంది.
అరటి పండ్లు అందరికీ సరిపడకపోవచ్చు. కొందరిలో ఇవి మైగ్రేన్‌కు కారణం కావచ్చు. మరికొందరిలో అలర్జీలకు (అనాఫిలాక్సిస్) దారితీయవచ్చు. అలాంటి సందర్భాలలో వెంటనే వైద్యులను సంప్రదించాలి. మధుమేహంతో బాధపడుతున్న వారు అరటి పండ్లను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, కొన్ని ఔషధాలు రక్తంలో పొటాషియం స్థాయిలను పెంచుతాయి. అటువంటి ఔషధాలు వాడుతున్నట్లయితే, అరటిపండ్ల వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారం తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.
అరటి పండు అద్భుతమైన పోషక విలువలు కలిగిన ఆరోగ్యకరమైన ఫలం అయినప్పటికీ, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి దానిని తీసుకోవడంలో జాగ్రత్త వహించడం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..