
మన వంటింట్లో ఉండే.. జీలకర్రలో ఎన్నో పోషకాలతోపాటు ఔషధ గుణాలు దాగున్నాయి. జీలకర్రను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.. జీలకర్రలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అందుకే.. రెగ్యులర్‌గా జీలకర్ర నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉదయం పరగడుపున జీలకర్ర నీరు త్రాగడం వల్ల అసంఖ్యాక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అనేకమంది నిపుణులు సూచిస్తున్నారు. మన నిత్య వంటల్లో సువాసన, రుచి కోసం జీలకర్రను ఉపయోగిస్తాము. ఇందులో విటమిన్ ఎ, సి, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇది అనేక ఇతర పోషకాలు, విటమిన్‌లను కలిగి ఉంది.
జీర్ణక్రియ మెరుగుదల: జీలకర్ర జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. వంటల్లో వాడడం వల్ల రుచితో పాటు అరుగుదలకు కూడా సహాయపడుతుంది. పరగడుపున ఈ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలైన అసిడిటీ, మలబద్ధకం, తేపుల వంటివి తగ్గుతాయి.
బరువు తగ్గడం, పొట్ట కొవ్వు నియంత్రణ: స్థూలకాయం, బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి జీలకర్ర నీరు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
కిడ్నీలో రాళ్లు: కిడ్నీలో రాళ్లను కరిగించడానికి జీలకర్ర నీటిని ఉపయోగిస్తుంటారు.
మధుమేహం నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో జీలకర్ర సహాయపడుతుంది. తద్వారా మధుమేహం నియంత్రణకు తోడ్పడుతుంది.
రక్తపోటు (బీపీ) నియంత్రణ: అధిక రక్తపోటుతో బాధపడే వారికి జీలకర్ర నీరు ప్రయోజనకరంగా ఉంటుంది.
పైల్స్ నివారణ: జీలకర్రలో అధికంగా ఉండే ఫైబర్ కంటెంట్ పైల్స్ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఆకలిని పెంచడం: కొంతమందికి మందగించిన ఆకలిని పెంచడానికి జీలకర్ర నీరు దోహదపడుతుంది. అందుకే మనం కూరల్లో ఎక్కువగా వాడతాము. చిన్న పిల్లలకు కూడా ఒక స్పూన్ జీలకర్ర నీరు తాగిస్తే, పాలు బాగా అరుగుతాయి.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం: జీలకర్ర నీరు జలుబు, దగ్గు వంటి సాధారణ అనారోగ్యాల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
గుండె ఆరోగ్యం: గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో జీలకర్ర ఉపయోగపడుతుందని చెప్పబడింది.
చర్మ, కేశ సౌందర్యం: ఇది చర్మం ముడతలను తగ్గించి, మొటిమలు రాకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా, జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
ఒక గ్లాసు నీటిలో రెండు టీస్పూన్ల జీలకర్రను వేయాలి. లేదా రాత్రి వేళ కొంచెం నీటిలో నానబెట్టుకోవాలి.. ఈ నీటిని మీడియం ఫ్లేమ్‌లో నీటిని వేడి చేయాలి. నీరు వేడెక్కిన తర్వాత, రెండు నిమిషాల పాటు మరిగించాలి. అప్పుడు నీరు రంగు మారుతుంది. ఆ తర్వాత నీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. అందులో సగం నిమ్మకాయ రసం పిండి, బాగా కలిపి ఉదయం పరగడుపున తాగాలి. పళ్ళు తోముకున్న వెంటనే, బ్రేక్‌ఫాస్ట్ ముందుగా తీసుకోవాలి.
ఈ జీలకర్ర నీరు ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఒక సహజసిద్ధమైన పానీయం. మనం ప్రతిరోజూ ఆహారంలో వాడే జీలకర్ర, నిమ్మకాయ, నీళ్లు మాత్రమే ఇందులో ఉపయోగిస్తాం. ఉపయోగించిన జీలకర్రను పారవేయకుండా, నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఈ చిట్కాను ప్రయత్నించి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఏమైనా సమస్యలుంటే.. వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత తీసుకోవడం ఉత్తమం..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..