
మనం రోజూ తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉంటేనే మన ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అలాగే, అన్ని రకాల వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. ఈ క్రమంలో పండ్లు, కూరగాయల్ని నిత్యం తీసుకోవటం మంచిది. వాటితో పాటు, చేపలను కూడా ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. చేపలలో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. సాధారణంగా మనం ఎక్కువగా తీసుకునే చికెన్, మటన్ కన్నా చేపలు, రొయ్యలు, పీతల వంటి జలచరాల ఆహారం ఆరోగ్యానికి శ్రేష్టమైంది. ఇవి సులభంగా, సంపూర్ణంగా జీర్ణమవుతాయి.
మటన్, చికెన్, గుడ్లతో పోలిస్తే.. చేపలు, రొయ్యలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ, మన దేశంలో చేపల వినియోగం తక్కువే. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రతి మనిషి ఏటా 18 కిలోల చేపలను తినాలి. ప్రపంచంలో ఏటా సగటున 20.7 కిలోగ్రాముల చేపలను తింటుంటే, అది మన దేశంలో కేవలం 9 కిలోలు మాత్రమే. అందుకే చేపలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలని, వారానికి కనీసం రెండుసార్లైనా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
గుండె ఆరోగ్యం: ముఖ్యంగా చేపలలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివని అనేక పరిశోధనలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. దీని ద్వారా గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.
మెదడు పనితీరు: చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వయసు సంబంధిత అభిజ్ఞాన క్షీణత, అల్జీమర్స్ వంటి న్యూరో డీజనరేటివ్ వ్యాధులను నివారించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
చూపు మెరుగుదల: చాలా రకాల చేపలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కార్నియాను ఆరోగ్యంగా ఉంచి చూపును మెరుగుపరుస్తుంది.
కండర ఆరోగ్యం – రోగనిరోధక శక్తి: చేపలలోని విటమిన్ ఇ కండరాల పనితీరును మెరుగుపరిచి అలసటను తగ్గిస్తుంది. అలాగే, రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది.
లీన్ ప్రొటీన్: చేపలలో లీన్ ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండర కణజాలానికి చాలా అవసరం.
అయితే, చేపలను కొనే ముందు వాటి నాణ్యతను జాగ్రత్తగా పరిశీలించాలి. చాలామంది వ్యాపారులు చనిపోయిన చేపలను రిఫ్రిజిరేటర్లలో మంచు పెట్టెల్లో నిల్వ చేసి అమ్ముతారు. మార్కెట్లకు వెళ్లినప్పుడు తాజా చేపలను గుర్తించి, వాటిని కొనుగోలు చేయాలి. చేపలు, రొయ్యలను వాటి వాసనను బట్టి అవి ఎలాంటివో తెలుస్తుంది. ఎక్కువగా వాసన వస్తుంటే అవి తాజావి కాదని గుర్తించాలి.
చేప కొనే ముందు దాన్ని నొక్కి చూడాలి. అది మెత్తగా ఉంటే తాజాది కాదని అర్థం. తాజా చేపలు గట్టిగా ఉంటాయి. చేపల మొప్పల రంగు ఎర్రగా లేదా గులాబీ రంగులో ఉండాలి. నిస్తేజంగా, గోధుమ రంగు పొలుసులు ఉంటే ఆ చేప మంచిది కాదని అర్థం. చేపల కళ్లు స్పష్టంగా ఉంటే అది తాజా చేప. అలా కాకుండా కనుగుడ్డు లోపలికి వెళ్లినా, కళ్లపై తెల్లటి పొర ఏర్పడినా, లేత రంగులో ఉన్నా వాటిని కొనకపోవడం మేలు.
చేపలను బాగా ఉడికించి తినడం శ్రేయస్కరం. పులుసుతో పాటు చేపలను మంటపై లేదా కాల్చడం, నూనె లేకుండా ఆవిరి సాయంతో ఉడికించడం వల్ల చేపలోని పోషకాలు దెబ్బతినవు. వేపుడు చేయాలనుకుంటే తక్కువ నూనెలో వేయించాలి. లేకుంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వంటి మంచి పోషకాలన్నీ నశిస్తాయి. చేపలను సరైన పద్ధతిలో వండుకొని తినడం ద్వారా వాటిలోని అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..