
ప్రస్తుత కాలంలో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతిచోటా వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. మనం నిత్యం వీధి కుక్కలు మనుషులపై, ముఖ్యంగా ఒంటరిగా వెళ్లేవారిపై దాడులు చేస్తున్న భయంకరమైన దృశ్యాలను చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాలలో కుక్క కాటు తీవ్రమైన గాయాలకు, ప్రాణనష్టానికి కూడా దారితీస్తోంది. సాధారణంగా కుక్కలు మనుషులకు ఎంతో స్నేహపూర్వక పెంపుడు జంతువులైనప్పటికీ, కొన్నిసార్లు ఆత్మరక్షణ కోసమో లేదా ఇతర కారణాల వల్లో అవి హఠాత్తుగా మనుషులపై దాడికి దిగుతుంటాయి. మరి మీరు ఎప్పుడైనా ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లేదా వాహనంపై వెళ్తున్నప్పుడు హఠాత్తుగా కుక్కలు మీపైకి వస్తే, కంగారు పడకుండా మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం.
1. భయపడి అస్సలు పరుగెత్తవద్దు
మీరు నిర్మానుష్యమైన రోడ్డుపై ఒంటరిగా నడుస్తున్నప్పుడు లేదా వాహనంపై వెళ్తున్నప్పుడు కుక్కలు మీపైకి వస్తే, భయపడి అస్సలు పరుగు పెట్టకూడదు. మీరు పరుగెత్తడం ప్రారంభిస్తే కుక్కలు మిమ్మల్ని మరింత ఎక్కువగా వెంబడించే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఎంతటి భయంకరమైన పరిస్థితి ఎదురైనా అక్కడే నిశ్శబ్దంగా ఆగిపోవడం అత్యంత ఉత్తమమైన పద్ధతి.
2. కుక్క కళ్లలోకి నేరుగా చూడకండి
దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న కుక్కతో నేరుగా కళ్లలోకి కళ్లు పెట్టి చూడటం (Eye Contact) చాలా ప్రమాదకరం. మీరు అలా దాని కళ్లలోకి చూస్తే, అది తనపై దాడికి సిద్ధమవుతున్నట్లుగా భావించి మరింత రెచ్చిపోతుంది. అందువల్ల, వెంటనే అక్కడే ఆగి, మీ కళ్లను కిందికి దించి నేలను చూడండి. మీ చూపులు కిందకు ఉండటం వల్ల కుక్క శాంతించే అవకాశం ఉంటుంది.
3. కుక్క వైపు తిరగడం
ఒకవేళ కుక్క మీపైకి దాడి చేయడానికి ప్రయత్నిస్తే, భయంతో వెనక్కి తిరిగి పారిపోకుండా, ధైర్యంగా దాని వైపు తిరగండి. ఇలా మీరు హఠాత్తుగా దాని వైపు తిరగడం వల్ల కుక్క కొద్దిగా ఉలిక్కిపడుతుంది. మీరు దానికి ఎలాంటి హాని చేయరని లేదా మీరు దానికి భయపడటం లేదని అది అర్థం చేసుకుని వెనకడుగు వేస్తుంది.
4. బైక్ వేగాన్ని పెంచవద్దు..
చాలా మంది బైక్ లేదా స్కూటీపై వెళ్తున్నప్పుడు కుక్కలు మొరుగుతూ వెంబడిస్తే భయంతో వాహనం వేగాన్ని (Speed) విపరీతంగా పెంచుతారు. అధిక వేగం వల్ల వాహనం అదుపు తప్పి కింద పడిపోయి పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే, కుక్కలు వెంబడించినప్పుడు కంగారు పడకుండా బైక్‌ను పక్కకు ఆపివేయండి. వాహనం ఆగిపోగానే కుక్కలు కూడా కొద్దిసేపు చూసి నిశ్శబ్దంగా వెళ్ళిపోతాయి.
5. గట్టిగా అరవండి..
ఒకవేళ కుక్క మిమ్మల్ని కరవడానికి బాగా దగ్గరకు వచ్చేస్తే, కోపంతో దాన్ని తరిమే ప్రయత్నం చేయకుండా, సహాయం కోసం చుట్టుపక్కల వారిని గట్టిగా అరుస్తూ పిలవండి. మీ చేతులతో మీ ముఖాన్ని, మెడ భాగాన్ని గట్టిగా కప్పి ఉంచుకుంటూ రక్షించుకోవడానికి ప్రయత్నించండి. మీ అరుపుల ధాటికి కుక్కలు కొంతవరకు భయపడి వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది.
6. దగ్గర ఉన్న వస్తువులను ఉపయోగించండి
కుక్క వెంటనే మీపైకి దూకితే, మీ చేతిలో ఉన్న బ్యాగ్, కర్ర, లేదా ఏదైనా వస్తువును గాలిలోకి విసరడం ద్వారా దాని దృష్టిని మరల్చవచ్చు. ఒకవేళ మీ దగ్గర బిస్కెట్లు లేదా తినడానికి ఏదైనా ఆహార పదార్థాలు ఉంటే, వాటిని కుక్క వైపు విసిరేయండి. ఆహారాన్ని చూడగానే కుక్కలు శాంతించి, దాడి చేయాలనే ఆలోచనను విరమించుకుంటాయి.