
రోజువారీ జీవితంలో తలనొప్పి అనేది చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే తలనొప్పి రాగానే వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటు. ఇలా తాగడం వల్ల తలనొప్పి వెంటనే తగ్గుతుందని కొందరు నమ్మితే, తలనొప్పిగా ఉన్నప్పుడు టీ, కాఫీలు తాగడం అసలు మంచిది కాదని మరికొందరు వాదిస్తారు. ఇంతకీ తలనొప్పికి, టీ, కాఫీలకు ఉన్న సంబంధమేంటి? వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు? అనేది తెలుసుకోవడం ముఖ్యం.
టీ, కాఫీలలో ఉండే కెఫిన్ వల్ల కొంతమందికి తలనొప్పి, మైగ్రేన్ బాధల నుండి తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అధ్యయనాలు చెబుతున్నాయి. కెఫీన్ రక్తనాళాలను సరిచేసి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే మార్కెట్లో లభించే కొన్ని రకాల తలనొప్పి మందులలో కూడా కెఫీన్‌ను ఒక పదార్థంగా ఉపయోగిస్తారు. అయితే దీని ప్రభావం అందరి శరీర తత్వంపై ఒకేలా ఉండదు.
అవును, కొన్ని సందర్భాల్లో టీ, కాఫీలే తలనొప్పికి ప్రధాన కారణం కావచ్చు. రోజూ ఎక్కువ మోతాదులో టీ లేదా కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు, అకస్మాత్తుగా వాటిని తాగడం మానేస్తే శరీరంలో కెఫీన్ లోపించి తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కెఫిన్ మోతాదు శరీరంలో ఎక్కువైతే అది మైగ్రేన్‌ను ప్రేరేపించడమే కాకుండా నిద్రలేమి, డిహైడ్రేషన్ మరియు నాడీ వ్యవస్థపై ఒత్తిడికి దారితీస్తుంది.
కేవలం టీ, కాఫీల అలవాటే కాకుండా, మన దైనందిన జీవితంలోని కొన్ని పొరపాట్లు కూడా తలనొప్పికి కారణమవుతాయి. ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు లేదా టీవీ స్క్రీన్‌లను చూడటం. సరిపడా నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి. శరీరానికి తగినంత నీరు అందకపోవడం
తలనొప్పి వచ్చిన ప్రతిసారీ టీ లేదా కాఫీలపై ఆధారపడటం సరైన పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పిగా అనిపించినప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి.
పుష్కలంగా నీరు తాగండి: తరచుగా శరీరంలో నీటి శాతం తగ్గడం వల్లే తలనొప్పి వస్తుంది. మంచి నీరు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
విశ్రాంతి తీసుకోండి: ప్రశాంతంగా, వెలుతురు తక్కువగా ఉండే గదిలో కాసేపు విశ్రాంతి తీసుకోండి.
సొంత వైద్యం వద్దు: ప్రతీ చిన్న తలనొప్పికి విచక్షణారహితంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ప్రమాదకరం.
వైద్యుడిని సంప్రదించండి: తలనొప్పి తరచుగా వస్తున్నా లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నా సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.