ఈ చిన్న పనితో మీ గుండెకు తిరుగుండదంతే.. తిన్న వెంటనే ఏం చేయాలంటే..?

దేశంలో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ బ్రిజ్‌మోహన్ అరోరా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కాను వెల్లడించారు. దీనికి జిమ్‌తో పనిలేదు.. ఖర్చు కూడా అవసరం లేదు. ఈ చిన్న అలవాటుతో మీ గుండె సేఫ్ అని డాక్టర్ అరోరా సూచించారు.

ఈ చిన్న పనితో మీ గుండెకు తిరుగుండదంతే.. తిన్న వెంటనే ఏం చేయాలంటే..?
Post Meal Walk Health Benefits

Updated on: Nov 11, 2025 | 11:40 AM

ప్రతి ఏటా గుండెపోటుతో లక్షల మంది మరణిస్తున్నారు. చిన్న నుంచి పెద్ద వరకు గుండెపోటుతో మరణించడం కలవరపెడుతుంది. ముఖ్యంగా యువత గుండెపోటుతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ నివేదిక ప్రకారం.. 2021లో దేశంలో 2,873,266 మరణాలు సీవీడి కారణంగా సంభవించాయి. వీటిలో మూడింట ఒక వంతు గుండెపోటు వల్లే జరిగాయి. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యవసరం. ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి డాక్టర్ బ్రిజ్‌మోహన్ అరోరా అనే అనుభవజ్ఞుడైన డాక్టర్ ఒక సులభమైన చిట్కా చెప్పారు. ప్రతి భోజనం తర్వాత నడవాలని ఆయన సూచించారు.

40శాతం ప్రమాదాన్ని తగ్గించే ఔషధం

భోజనం తర్వాత కేవలం 10 నుండి 15 నిమిషాలు నడిస్తే గుండెపోటు ప్రమాదం ఏకంగా 40శాతం వరకు తగ్గుతుందని అరోరా నొక్కి చెప్పారు. అది ఒక ఔషధం అయి వుంటే తాను దాన్ని ప్రతి రోగికి తప్పకుండా సూచించేవాడినని ఆయన అన్నారు. ఈ చిట్కా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలతో బాధపడేవారికి కూడా ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. అయితే చాలా మంది ఇప్పటికీ అలా చేయడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.

భోజనం తర్వాత నడవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు

 చక్కెర నియంత్రణ

ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర పెరగడం వల్ల ఇన్సులిన్ పెరుగుతుంది. ఇది ధమనులలో వాపుకు దారితీస్తుంది. నడవడం ద్వారా చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వచ్చి వాపు తగ్గుతుంది. వాపు తగ్గడం వల్ల ధమనులకు నష్టం తగ్గుతుంది. గుండెపోటుకు కారణమయ్యే ఆక్సీకరణ ఒత్తిడి ప్రమాదం కూడా తొలగిపోతుంది.

ట్రైగ్లిజరైడ్‌ల తగ్గింపు

ట్రైగ్లిజరైడ్‌లు అనేవి ఒక రకమైన కొవ్వు కణాలు. ఇవి ధమనులలో పేరుకుపోయి ఫలకాన్నిఏర్పరుస్తాయి, ఇది గుండెపోటు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. భోజనం తర్వాత నడవడం వల్ల ఈ ట్రైగ్లిజరైడ్‌లు రక్తం నుండి తొలగించబడతాయి. తద్వారా రక్తం శుద్ధి అవుతుంది.

నైట్రిక్ ఆక్సైడ్ పెరుగుదల

నడవడం వల్ల రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ అనే పదార్థం విడుదల అవుతుంది. ఇది ధమనుల గోడల నుండి విడుదలై, రక్త నాళాలను వెడల్పు చేస్తాయి. దీనివల్ల రక్తపోటు తగ్గి, రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. ధమనులలో ఒత్తిడి, నష్టం తగ్గుతుంది.

మెదడు చురుకుదనం

తిన్న తర్వాత వచ్చే నిద్ర, మగత తగ్గుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది చక్కెర మరియు ఇన్సులిన్ పెరగడం వల్ల సంభవిస్తుంది. భోజనం తర్వాత నడవడం ద్వారా ఈ సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

ఇది సిద్ధాంతం కాదని.. నిజమైన ఫలితాలతో నిరూపించడం జరిగిందని డాక్టర్ అరోరా తెలిపారు. జిమ్ అక్కర్లేదు, ఖర్చు అసలే లేదు. 15 నిమిషాల నడక అలవాటుతో మీ గుండెను, ఆరోగ్యాన్ని కాపాడుకోండని డాక్టర్ అరోరా ప్రజలకు సూచించారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..