Telugu News Lifestyle DIY Gas Stove Repair: Fix Low Flame and Sim Problems, Easy Home Solution for Gas Burner Issues
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా..? ఈ సింపుల్ చిట్కాతో పెద్ద మంట రావడం పక్కా..
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా లేదా సిమ్‌లో పెడితే ఆరిపోతుందా..? దీనికి పరిష్కారం కోసం సర్వీస్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం చిన్న హోల్ ను శుభ్రం చేయడం ద్వారా ఇంట్లోనే సులభంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇది డబ్బు, సమయం ఆదా చేస్తుంది.
అందరి ఇళ్లల్లో దాదాపు ఎల్‌పీజీ గ్యాస్ ఉంటుంది. అయితే.. మనం రోజువారీగా ఉపయోగించే గ్యాస్ స్టవ్ జిడ్డుగా మారడం, మంట చిన్నదిగా రావటం లేదా సిమ్ లో పెడితే ఆరిపోవడం వంటి సమస్యలను చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సాధారణ సమస్యను పరిష్కరించడానికి సర్వీస్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని సులభమైన దశలను అనుసరించడం ద్వారా ఇంట్లోనే స్వయంగా రిపేర్ చేసుకోవచ్చు. ఇది మీ సమయాన్ని, డబ్బును ఆదా చేస్తుంది.
ఈ సమస్యకు ప్రధాన కారణం బర్నర్ కు గ్యాస్ సరఫరా చేసే చిన్న హోల్ జిడ్డుపట్టి లేదా డస్ట్ చేరి మూసుకుపోవడం. గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగడం వల్ల మంట చిన్నదిగా వచ్చి, సిమ్ లో పెట్టినప్పుడు గ్యాస్ సరిగా రాక ఆరిపోతుంది. ఈ హోల్ ను శుభ్రం చేయడం ద్వారా సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు.
స్టవ్ రిపేర్ చేసే విధానం:
ముందు జాగ్రత్తలు: ముందుగా గ్యాస్ రెగ్యులేటర్ ను పూర్తిగా ఆఫ్ చేయాలి. స్టవ్ ఉపయోగించి ఉంటే బర్నర్లు వేడిగా ఉంటాయి కాబట్టి, అవి చల్లారిన తర్వాతే రిపేర్ మొదలు పెట్టాలి.
భాగాలను తొలగించడం: స్టవ్ మీద ఉండే స్టాండ్, ప్లేట్లు, బర్నర్లను జాగ్రత్తగా తీసి పక్కన పెట్టాలి. బర్నర్లు వేడిగా ఉంటే, ఏదైనా మందపాటి క్లాత్ తో పట్టుకుని తొలగించాలి.
స్టవ్ ను తిరగేయడం: ఇప్పుడు గ్యాస్ స్టవ్ ను పూర్తిగా తిరగేయాలి, అంటే రివర్స్ చేయాలి.
స్క్రూ తొలగింపు: బర్నర్ కు గ్యాస్ సరఫరా చేసే పైపును పట్టుకున్న స్క్రూను గుర్తించాలి. దీన్ని రించ్ లేదా కటింగ్ ప్లేయర్ సహాయంతో విప్పాలి. స్క్రూ టైట్ గా ఉంటే, కొద్దిగా కొబ్బరి నూనె వేసి ఒక గంట లేదా రెండు గంటల తర్వాత ప్రయత్నిస్తే సులభంగా వస్తుంది. కొంచెం లూస్ అయిన తర్వాత చేత్తో పూర్తిగా తీసివేయవచ్చు.
పైపును తొలగించడం: స్క్రూ తీసిన తర్వాత, గ్యాస్ పైపును జాగ్రత్తగా తొలగించాలి.
హోల్ ను శుభ్రం చేయడం: ఈ పైపు నుండి గ్యాస్ బర్నర్ లోకి వెళ్లే చిన్న హోల్ ను గుర్తించాలి. ఇది సాధారణంగా జిడ్డుపట్టి లేదా డస్ట్ తో మూసుకుపోయి ఉంటుంది. ఒక పిన్నీస్ ను తీసుకుని, ఈ చిన్న హోల్ లో నెమ్మదిగా రెండు, మూడు సార్లు గుచ్చాలి. దీనివల్ల పేరుకుపోయిన డస్ట్ లేదా జిడ్డు తొలగిపోతుంది. డస్ట్ తొలగించిన తర్వాత, శుభ్రమైన క్లాత్ తో ఆ ప్రాంతాన్ని తుడవాలి. అవసరమైతే రెండు, మూడు సార్లు ఈ ప్రక్రియను పునరావృతం చేయవచ్చు.
తిరిగి అమర్చడం: శుభ్రం చేసిన తర్వాత, గ్యాస్ పైపును తిరిగి దాని స్థానంలో పెట్టి, స్క్రూను గట్టిగా బిగించాలి.
స్టవ్ భాగాల అమరిక: ఇప్పుడు స్టవ్ ను పైకి తిప్పి, స్టాండ్, ప్లేట్లు, బర్నర్లను యధావిధిగా అమర్చాలి. ఒక్కోసారి బర్నర్లు బిగుసుకుపోయి రాకపోవచ్చు, అటువంటి సందర్భాలలో వాటిని తీయకపోయినా పర్వాలేదు, పైపును తెరిచి శుభ్రం చేయవచ్చు.
పరీక్షించడం: అన్ని భాగాలను తిరిగి అమర్చిన తర్వాత, గ్యాస్ రెగ్యులేటర్ ను ఆన్ చేసి, స్టవ్ వెలిగించి పరీక్షించాలి. మంట బలంగా వచ్చి, సిమ్ లో కూడా ఆరిపోకుండా ఉన్నట్లయితే, సమస్య విజయవంతంగా పరిష్కరించబడినట్లే.
ఈ విధంగా స్వయంగా రిపేర్ చేసుకోవడం ద్వారా మీరు సర్వీస్ సెంటర్ ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు, అలాగే డబ్బు, సమయం రెండింటినీ ఆదా చేసుకోవచ్చు..