
చర్మ సంరక్షణలో షీట్ మాస్క్‌లు ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ఇవి చర్మానికి అధిక తేమను, పోషణను, పునరుజ్జీవనాన్ని అందిస్తాయి. అయితే, షీట్ మాస్క్‌ల నుండి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే, వాటిని సరిగా వాడాలి. ప్రముఖ చర్మ నిపుణురాలు నిరుపమ పర్వాందా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షీట్ మాస్క్ వాడకంపై ఒక వీడియోను పంచుకున్నారు. “షీట్ మాస్క్‌ను సరిగ్గా ఉపయోగిస్తే, దాని ప్రయోజనాలు ఎన్నో రెట్లు పెరుగుతాయి” అని ఆమె వివరించారు. నిపుణులు చెప్పినట్లుగా షీట్ మాస్క్‌ను ఎలా ఉపయోగించాలో, దాని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
షీట్ మాస్క్ వాడే పద్ధతి:
షీట్ మాస్క్‌ను వాడే ముందు, కొన్ని నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఈ చిన్న చిట్కా మాస్క్ పనితీరును గణనీయంగా పెంచుతుంది. చల్లదనం చర్మాన్ని ప్రశాంతపరుస్తుంది, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, రిఫ్రెష్ అనుభూతిని ఇస్తుంది.
ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దుమ్ము, నూనె, మేకప్‌ను పూర్తిగా తొలగించాలి. ఆ తర్వాత మృత కణాలను తొలగించడానికి సున్నితమైన ఎక్స్‌ఫోలియేషన్ చేయాలి. ఇది మాస్క్‌లోని సీరం చర్మంలోకి బాగా ఇంకడానికి సాయపడుతుంది.
మాస్క్‌ను జాగ్రత్తగా విప్పి, ముఖంపై సరిగా పెట్టాలి. కళ్ళు, ముక్కు, నోరు భాగాలను సరిగ్గా అమర్చాలి. గాలి బుడగలు లేకుండా చూసుకుని, చర్మానికి మాస్క్ పూర్తిగా అతుక్కునేలా చేయాలి.
ప్యాకెట్‌లో మిగిలి ఉన్న సీరంను వృథా చేయవద్దు! దానిని మెడ, చేతులు, మోచేతులకు దారాళంగా రాయాలి. ఈ ప్రాంతాలకు కూడా అదనపు తేమ, పోషణ అవసరం. ఈ సీరం వాటిని మృదువుగా, కాంతివంతంగా మార్చగలదు.
మీ చర్మ అవసరాలకు తగిన పదార్థాలు ఉన్న షీట్ మాస్క్‌ను ఎంచుకోండి. మీకు తేమ, కాంతివంతం, వృద్ధాప్య నిరోధక లేదా ఉపశమనం కావాలంటే, మీ కోసం ఒక సరైన మాస్క్ ఉంటుంది. హైలురోనిక్ యాసిడ్, విటమిన్ సి, లేదా గ్రీన్ టీ లాంటి పదార్థాల కోసం చూడండి. ఇవి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.