
చర్మంపై చిన్న మొటిమ రాగానే దాన్ని త్వరగా పోగొట్టుకోవడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో చూసి లేదా ఇంట్లోని పెద్దల మాటలు విని విక్స్ వేపోరబ్ మొటిమపై రాసి రాత్రంతా ఉంచే అలవాటు చాలామందికి ఉంటుంది. విక్స్ రాస్తే రాత్రికి రాత్రే మొటిమలు మాయమవుతాయని నమ్ముతుంటారు. కానీ, ఇది చర్మానికి ఎంతవరకు సురక్షితం? ప్రముఖ చర్మవైద్య నిపుణురాలు (Dermatologist) డాక్టర్ ప్రియాంక రెడ్డి దీనిపై కీలక సూచనలు చేశారు.
ఈ మేరకు ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు ప్రియాంక రెడ్డి ఈ విషయమై తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో , ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి విక్స్ ఉపయోగపడుతుందని, అంతేగానీ మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరవడానికి లేదా మొటిమలకు చికిత్స చేయడానికి కాదని ఆ చర్మ వైద్యురాలు వివరిస్తున్నారు. విక్స్‌లో కర్పూరం, మెంథాల్, యూకలిప్టస్ నూనె వంటి పదార్థాలతో పాటు, చాలా చిక్కగా ఉండే పెట్రోలియం బేస్ కూడా ఉంటుంది. దీనిని ముఖానికి పూయడం వల్ల చర్మంపై ఒక మందపాటి పొర ఏర్పడి, మీ చర్మ రంధ్రాలు మరింతగా మూసుకుపోతాయి.
ఇంకా ఇలా కూడా వివరిస్తున్నారు, విక్స్ రాసుకున్న తర్వాత, మీ ముఖంపై చల్లగా లేదా తేలికపాటి జలదరింపుగా అనిపించవచ్చు. అందుకే కొంతమంది ఆ మందు మొటిమపై పనిచేసి, దాన్ని నయం చేస్తోందని అనుకుంటారు. కానీ, వాస్తవానికి, అది నిజం కాదు. ఈ చల్లని అనుభూతి మొటిమ నయం కావడం వల్ల కాదు, ముఖ చర్మంపై మంట లేదా చికాకు కలగడం వల్ల వస్తుంది. అందువల్ల, విక్స్‌ను ముఖానికి అస్సలు రాసుకోకూడదని చెబుతున్నారు.
చాలా మంది మొటిమలపై విక్స్‌ను రాత్రంతా అలాగే వదిలేస్తారు. డాక్టర్ ప్రియాంక ప్రకారం, మొటిమపై విక్స్ రాసి రాత్రంతా అలాగే వదిలేయడం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల చర్మం తీవ్రంగా మండిపోవడం, ఎర్రబడటం జరుగుతుంది. అదనంగా, ఆ ప్రదేశంలో నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. వైద్య పరిభాషలో దీనిని పోస్ట్-ఇన్‌ఫ్లమేటరీ హైపర్‌పిగ్మెంటేషన్ అంటారు. మొటిమ అనేది కొద్ది రోజుల్లో సహజంగానే తగ్గిపోవచ్చు, కానీ, విక్స్ వంటివి వాడటం వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు తగ్గడానికి కొన్ని వారాలు లేదా నెలల సమయం పడుతుంది.