అద్దె ఇంట్లో మేకులకు ఓనర్ ఒప్పుకోవడం లేదా.. అయితే ఇలా చేయండి..! గోడను టచ్ చేయకుండానే..

అద్దె ఇంట్లో ఉన్నప్పుడు.. చిన్న పనైనా ఇంటి యజమాని అనుమతి తీసుకోవాలి. ముఖ్యంగా గోడలకు మేకులు కొట్టడం అంటే చాలా మంది యజమానులు అస్సలు ఇష్టపడరు. అలాంటి సమయంలో ఇంటిని అందంగా, ఆకర్షణీయంగా ఎలా మార్చుకోవాలి..? అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి వారి కోసమే ఇప్పుడు మార్కెట్లో కొన్ని స్మార్ట్ పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అద్దె ఇంట్లో మేకులకు ఓనర్ ఒప్పుకోవడం లేదా.. అయితే ఇలా చేయండి..! గోడను టచ్ చేయకుండానే..
Damage Free Decorating

Updated on: Jun 22, 2025 | 9:08 PM

సొంత ఇల్లు ఉన్నవారికి ఇలాంటి నిబంధనలు ఉండవు. ఎక్కడ నచ్చితే అక్కడ ఫోటోలు, పెయింటింగ్‌లు, హుక్స్, తెరలు వేలాడించే రాడ్లు అన్నీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. కానీ అద్దె ఇంట్లో ఇవన్నీ చేసేటప్పుడు అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే చిన్న రంధ్రం పడినా గోడలపై గుర్తులు మిగిలిపోతే యజమాని ఒప్పుకోరు.

కొత్తగా అద్దెకు వెళ్ళినప్పుడు గోడలపై మేకులు వేయకూడదని చాలా మంది యజమానులు ముందే చెబుతారు. అయితే ప్రస్తుత రోజుల్లో అందుబాటులో ఉన్న కొత్త ఇంటి అలంకరణ వస్తువులు ఈ అవసరాన్ని తీరుస్తాయి.

గమ్‌ తో అతుక్కునే హుక్స్ (Adhesive Hooks).. ప్రస్తుతం మార్కెట్లో దొరికే గమ్‌ తో అతుక్కునే హుక్స్ మేకుల బదులు ఉపయోగపడుతాయి. ఇవి గోడలకు హాని చేయవు. మచ్చలు లేకుండా గట్టిగా అతుక్కుంటాయి. వీటిని తేలికపాటి అలంకరణ వస్తువులకు వాడొచ్చు.

మరో మంచి పరిష్కారం వెల్క్రో స్టిక్కర్లు (Velcro Stickers). వీటిని రెండు భాగాలుగా వాడొచ్చు.. ఒక భాగాన్ని గోడకు, ఇంకో భాగాన్ని వస్తువుకు అంటించి నచ్చినప్పుడు తీసివేయవచ్చు. వీటి ప్రత్యేకత గోడపై చెడ్డ మచ్చలు ఉండనివ్వవు.

టెన్షన్ రాడ్‌ లు (Tension Rods).. తెరల కోసం సాధారణంగా కిటికీ పక్కన మేకులు కొడుతారు. కానీ ఇప్పుడు టెన్షన్ రాడ్‌ లు అనేవి అందుబాటులో ఉన్నాయి. వీటిని రెండు గోడల మధ్య గట్టిగా అమర్చడం ద్వారా తెరలు వేలాడించవచ్చు. డ్రిల్లింగ్ అవసరం లేదు. గోడలు చెడిపోవు.

ఇంకో కొత్త పద్ధతి అలంకరణ వాల్ టేప్‌ లు (Wall Safe Tapes). ఇవి అందమైన రంగుల్లో ఉంటాయి. తేలికపాటి ఫ్రేములు, చిన్న గ్రీటింగ్‌ లు, అలంకరణ కార్డులు అంటించడానికి బాగుంటాయి. వీటిని తీసివేసినా గోడపై మచ్చలు ఉండవు.

పెగ్‌ బోర్డ్ (Peg Board) అనే స్టైలిష్ అలంకరణ పద్ధతి కూడా ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. ఇది ఒక ప్యానెల్ లా ఉంటుంది. ఇందులో మీరు అనేక రకాల చిన్న వస్తువులను వేలాడించవచ్చు. ఇది గోడకు నేరుగా అంటించకుండా నిలబెట్టే పద్ధతిలో కూడా ఉపయోగించవచ్చు.

అద్దె ఇంట్లో ఉండి గోడలకు హాని చేయకుండా ఇంటిని అలంకరించుకోవాలంటే.. ఇప్పుడు మార్కెట్లో లభించే ఈ స్మార్ట్ చిట్కాలు ఉపయోగపడతాయి. సుత్తి, మేకులు లేకుండానే ఫోటోలు, తెరలు, అలంకరణ వస్తువులు వేలాడించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల యజమానికి అభ్యంతరం ఉండదు. మీరు మీ ఇంటిని ఇష్టం వచ్చినట్లు అందంగా మార్చుకోవచ్చు.