
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మలబద్ధకం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. ఉదయాన్నే విసర్జన సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా కడుపు ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం, వికారం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. తగినంత నీరు తాగకపోవడం, పీచు పదార్థాలు లేని ఆహారం, ఒత్తిడి, మారిన జీవనశైలి దీనికి ప్రధాన కారణాలు. అయితే ఈ సమస్య నుండి బయటపడటానికి ప్రముఖ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఒక అద్భుతమైన ఆయుర్వేద చూర్ణాన్ని సూచించారు.
కేవలం ఐదు సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసే ఈ పొడి, మందుల అవసరం లేకుండానే మీ ప్రేగులను శుభ్రపరుస్తుంది.
కరక్కాయ పొడి: 2 టీస్పూన్లు (ఇది ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తుంది)
సోంపు పొడి: 1 టీస్పూన్ (జీర్ణక్రియకు మరియు కడుపు చల్లదనానికి)
జీలకర్ర: 1 టీస్పూన్ (గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది)
ఎండు అల్లం పొడి (శొంఠి): అర టీస్పూన్ (జీర్ణరసాల ఉత్పత్తికి)
నల్ల ఉప్పు: 1 టీస్పూన్ (రుచితో పాటు అరుగుదలకు మేలు చేస్తుంది)
పైన పేర్కొన్న అన్ని పదార్థాలను కలిపి గ్రైండర్‌లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. మీకు పచ్చి వాసన నచ్చకపోతే, జీలకర్ర, సోంపును కొద్దిగా వేయించి పొడి చేసుకోవచ్చు. ఈ చూర్ణాన్ని ఒక గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి.
సాధారణ మలబద్ధకం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు అర టీస్పూన్ నుండి ఒక టీస్పూన్ పొడిని గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.
తీవ్రమైన సమస్య: ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే మోతాదును కొద్దిగా పెంచుకోవచ్చు.
జాగ్రత్త: మీకు ఎసిడిటీ ఎక్కువగా ఉంటే అల్లం పొడిని తగ్గించండి. విరేచనాలు అవుతుంటే కరక్కాయ పొడిని తక్కువగా వాడండి.
గర్భిణీలు: గర్భవతులు మలబద్ధకంతో బాధపడుతుంటే, వైద్యుని సంప్రదించకుండా ఈ పొడిని వాడకూడదు.
ఆరోగ్య సమస్యలు: తీవ్రమైన ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ముందుగా డాక్టరును అడగాలి.
విరేచనాలు: మోషన్స్ అవుతున్న వారు ఈ చూర్ణానికి దూరంగా ఉండాలి.
మలబద్ధకం మళ్లీ రాకుండా ఉండాలంటే కేవలం పొడి మాత్రమే సరిపోదు, మీ అలవాట్లలో ఈ మార్పులు చేసుకోండి..
నడక: భోజనం చేసిన తర్వాత కనీసం 15-20 నిమిషాలు నడవండి.
నీరు: రోజంతా పుష్కలంగా నీరు తాగుతూ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి.
ఫైబర్ ఆహారం: సొరకాయ, బీరకాయ వంటి పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు, ఓట్స్, సబ్జా గింజలు, పండ్లను మీ ఆహారంలో భాగం చేసుకోండి.
మీ ఆరోగ్యం మీ ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. సహజమైన పద్ధతులతో జీర్ణ వ్యవస్థను శుద్ధి చేసుకుని, ఆరోగ్యంగా ఉండండి.