
టీ పొడి నాణ్యత టీ రుచిపై చాలా ప్రభావం చూపుతుంది. టీ పొడిని ఎప్పుడూ గాలి పోకుండా ఉండే డబ్బాలో నిల్వ చేయాలి. తేమ ఉన్న చోట లేదా బాగా వాసన వచ్చే పదార్థాల దగ్గర ఉంచితే టీ అసలు సువాసన పోతుంది. ఇతర వాసనలను పీల్చుకుంటుంది. గ్లాస్ లేదా స్టీల్ జార్లలో మూత ఉన్న డబ్బాలో ఉంచితే అది ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
టీ తయారీలో నీరు చాలా ముఖ్యం. పాతగా నిల్వ ఉంచిన నీటిని లేదా మళ్లీ మళ్లీ వేడి చేసిన నీటిని వాడితే టీ రుచి పూర్తిగా మారిపోతుంది. అందుకే ప్రతిసారీ తాజా నీటిని మాత్రమే వాడాలి. మీ ఇంట్లో ట్యాప్ నీటిలో ఎక్కువ క్లోరిన్ ఉంటే ఫిల్టర్ చేసిన నీటిని వాడటం మంచిది.
చాలా మంది టీ కోసం నీటిని పొంగిపొర్లే వరకు వేడి చేస్తారు. ఇది మంచి టీకి బదులు చేదుగా మారే అవకాశం ఉంది. వేడి తక్కువైనా టీకి రుచి రాదు. అందుకే సరైన ఉష్ణోగ్రత వద్ద నీటిని మరిగించడం ముఖ్యం. అలాగే అల్యూమినియం పాత్రల్లో కాకుండా స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రల్లో వేడి చేయడం మంచి ఎంపిక.
టీ వేయగానే దానిని నీటిలో వేసి ఎక్కువసేపు మరిగిస్తే అది చాలా చేదుగా మారుతుంది. దీని బదులు నీటిని ముందుగా మరిగించి తరువాత ఆ వేడి నీటిలో.. టీ పొడిని వేసి మూతపెట్టి కొన్ని నిమిషాల పాటు ఉంచితే సహజమైన వాసన రుచి అలాగే ఉంటాయి.
టీ తయారీలో పాలు, చక్కెర వాడకం వ్యక్తిగత ఇష్టం అయినా ఆరోగ్యపరంగా చూస్తే ఇవి తక్కువగా ఉండటం మంచిది. కొంతమంది ఎక్కువ చక్కెర వేసి టీ రుచిని పాడుచేస్తారు. అవసరమైనంత చక్కెర, తక్కువ పాలు వేసి టీ రుచి, ఆరోగ్యాన్ని సమతుల్యంలో ఉంచవచ్చు. అసలు టీ రుచిని అనుభవించాలంటే బ్లాక్ టీ లాంటి ప్రత్యామ్నాయాలు కూడా ప్రయత్నించవచ్చు.
టీ తాగడం మన రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగం. కానీ అది మనం తినే ఇతర ఆహారాల లాగే శ్రద్ధతో తయారు చేయాల్సిన అవసరం ఉంది. పైన చెప్పిన చిన్న సూచనలు పాటిస్తే ప్రతిసారీ మీ టీ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది.