
తెలుగు భాషలో సామెతలకు ఎంతో ప్రత్యేకత ఉంది. చిన్న సామెతలో కూడా లోతైన అర్థం ఉంటుంది. మనుషుల ప్రవర్తనను, వారి ఆలోచనా విధానాన్ని, నిజ స్వభావం, అనుభవాలను కళ్లకు కట్టినట్లు చెప్పే సామెతలు ఎన్నో ఉన్నాయి. చాలా సామెతలను తరాలుగా వాడుకలో ఉన్నాయి. అలాంటి ఆసక్తికరమైన సామెతల్లో “చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద” అనేది ఒకటి. ఈ సామెతను ఎప్పుడు ఉపయోగిస్తారు? దీని వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుందాం.
“చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద” అంటే పైకి ఒక పని చేస్తున్నట్లు కనిపిస్తూ, మనసులో మాత్రం మరో ఆలోచనతో ఉండటం అని అర్థం. అంటే మనసును ఒకచోట లగ్నం చేసి.. దృష్టి మరోచోట ఉండటం. ఏదైనా పనిపై పూర్తి శ్రద్ధ పెట్టకుండా, పైకి మాత్రం నిబద్ధత ఉన్నట్లు నటించే వ్యక్తులను ఉద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు.
ఒక వ్యక్తి ఆలయానికి వెళ్లి దేవుడిని ఎంతో భక్తితో పూజిస్తున్నట్లు కనిపిస్తాడు. కానీ అతని మనసంతా బయట వదిలివచ్చిన చెప్పుల మీదే ఉంటుంది. ఎవరైనా గుడికి బయట తీసిన తన చెప్పులు తీసుకెళ్తారేమోనని ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి సందర్భాన్ని ఈ సామెతతో పోలుస్తారు. ఆలయానికి వెళ్లినప్పుడు ఇతర అంశాల మీద ధ్యాస పెట్టకుండా.. పూర్తిగా దేవుడిపై మనసును లగ్నం చేస్తేనే ప్రయోజనం ఉంటుందని ఈ సామెత సూచిస్తుంది.
కొందరు కార్యాలయంలో పని చేస్తున్నట్లు కనిపిస్తూ, మనసంతా మొబైల్ ఫోన్ లేదా ఇతర విషయాలపై పెట్టేవారికి ఈ సామెత సరిపోతుంది. అలాంటి సందర్భాల్లో “చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద” అన్నట్లు మీ ప్రవర్తన ఉందని సహచరులు లేదా పై ఉద్యోగులు అంటుంటారు.
మనం ఏ పని చేసినా దానిపై పూర్తి శ్రద్ధ, ఏకాగ్రత ఉండాలి. పైకి ఒకలా కనిపిస్తూ, లోపల మరోలా ఆలోచించడం వల్ల పనిలో నాణ్యత ఉండదు. అందుకే మనసు పెట్టి పని చేయాలని ఈ సామెత సూచిస్తుంది. ఇలా విలువలు బోధించే తెలుగు సామెతలు కేవలం పదాల సమాహారం మాత్రమే కాదు.. మనిషి జీవితానికి ఉపయోగపడే అనుభవ పాఠాలు కూడా!