AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. సామెత అర్థం తెలుసా?

Telugu Proverb Meaning: ఒక చిన్న సామెతలో కూడా ఎంతో లోతైన అర్థం ఉంటుంది. తెలుగులో చాలా సామెతలు వాడుకలో ఉన్నాయి. అలాంటి వాటిలో కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అనే సామెత ఒకటి. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా? ఒక క్లిష్టమైన, ఇబ్బందికర పరిస్థితిలో ఇతరుల వివాదంలో చిక్కుకుని నలిగిపోవడాన్ని ఈ సామెత తెలియజేస్తుంది.

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. సామెత అర్థం తెలుసా?
Telugu Proverb MeaningImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Oct 17, 2026 | 1:33 PM

Share

తెలుగు భాషలో లోతైన అర్థంతో కూడిన ఎన్నో సామెతలు వాడుకలో ఉన్నాయి. మన మునుపటి తరాలకు చెందిన పెద్దల నుంచి ఈ సామెతలు వారసత్వంగా వస్తున్నాయి. మనిషి జీవితంలో ఎదురైన పరిస్థితులు, అనుభవాలు, సంబంధాల నుంచే ఈ సామెతలు పుట్టాయి. గొప్ప సత్యాన్ని చిన్న పదాలతోనే వివరించడం ఈ సామెతలతో సాధ్యం. మంచి, చెడుల మధ్య తేడాను సులభంగా అర్థమయ్యేలా వివరిస్తాయి. లోతైన అర్థమున్న సామెతల్లో ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అనే సామెత కూడా ఒకటి. అసలు ఈ సామెతకు అర్థం ఏమిటి? దీన్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం.

సామెత అర్థం ఏమిటి?

‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అంటే రెండు వైపులా ఉన్న వ్యక్తులను సంతృప్తిపరచలేని పరిస్థితి అని అర్థం. ఒక సమస్యలో ఇద్దరి మధ్య నలిగిపోయి, ఎవరి పక్షాన నిలిచినా మరొకరికి కోపం వచ్చే సందర్భాలను వివరించడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు. ఒక పాము తనకు ఆహారంగా నోటిలో కప్పను కరుచుకుంది. కప్పను విడిచిపెట్టమని చెబితే దానికి పాము అంగీకరించదు. అలాగే కప్పను కరవమని పాముకు చెబితే ప్రాణభయంతో ఉన్న కప్పకు ఇబ్బందికరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకున్నా ఒకరు మన పట్ల కోపం ప్రదర్శిస్తారు. ఈ తరహా సంకట పరిస్థితినే ఈ సామెత సూచిస్తుంది.

సామెతను ఎప్పుడు ఉపయోగించాలి?

కుటుంబం, స్నేహితుల మధ్య, కార్యాలయాల్లో లేదా ఇతర సామాజిక వ్యవహారాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు ఒకరు తమకు మద్దతు ఇవ్వాలని, మరొకరు తమకు న్యాయం చేయాలని కోరుకుంటారు. అప్పుడు మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరి మాట విన్నా మరొకరు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు, ఒక కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య వివాదం జరిగింది. వారిలో ఏ ఒకరికి మద్దతు ఇచ్చినా మరొకరు అసంతృప్తి చెందుతారు. ఇద్దరికీ నచ్చేలా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినా వారు అంగీకరించకపోవచ్చు. ఇరువర్గాలకూ నష్టం కలగకుండా ఏ నిర్ణయమూ తీసుకోలేని నిస్సహాయ పరిస్థితిలో ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అనే సామెతను ఉపయోగిస్తారు.

ఈ సామెత ఇచ్చే సందేశం, నీతి ఏంటి?

ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరిచేలా సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదని ఈ సామెత గుర్తుచేస్తుంది. ముఖ్యంగా వివాదాల సమయంలో భావోద్వేగాలకు లోనుకాకుండా, రెండు వైపుల వాదనలను వినాలి. ఎవరి పట్లా పక్షపాతం చూపకుండా, వాస్తవాలను పరిశీలించి న్యాయమైన నిర్ణయం తీసుకోవాలి. అదే సమయంలో అనవసరమైన వివాదాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం కూడా అవసరం. అయితే అందరినీ మెప్పించడం సాధ్యం కాదనే కారణంతో న్యాయం చేయకుండా ఉండకూడదు. పరిస్థితిని అర్థం చేసుకుని, సరైన నిర్ణయం తీసుకోవడమే ముఖ్యం.

మొత్తానికి ఒకరిని సంతృప్తిపరిస్తే మరొకరు కోపగించుకునే పరిస్థితిని ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అనే సామెత చక్కగా వివరిస్తుంది.

Follow Us