AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. ఈ సామెత అర్థం తెలుసా?

తెలుగు సామెతల్లో చాలా లోతైన అర్థం ఉంటుంది. గొప్ప సందేశాన్ని కూడా చిన్న పదాలతో ఎదుటి వారికి అర్థమయ్యేలా సామెతల ద్వారా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం జనం వాడుకలో ఉన్న పలు సామెతల్లో “అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు” అనే సామెత కూడా ఒకటి. మాటల్లో తరచూ ఉపయోగించే ఈ సామెత వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. అసలు ఈ సామెత ఎలా పుట్టింది? ఈ సామెతను ఏయే సందర్భాల్లో ఉపయోగిస్తారు? దీని ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.

అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. ఈ సామెత అర్థం తెలుసా?
Telugu Proverb Meaning
Janardhan Veluru
|

Updated on: Oct 19, 2026 | 4:08 PM

Share

Telugu Proverb Meaning: తెలుగు భాషలోని సామెతల్లో చాలా లోతైన అర్థం ఉంటుంది. అందుకే తరతరాలుగా ఈ సామెతలను జనం వాడుతూనే ఉన్నారు. సామెతలు జీవిత అనుభవాలు, ప్రవర్తనలోని లోపాలను ఎంతో సరళంగా వివరిస్తాయి. అలాంటి అర్థవంతమైన సామెతల్లో “అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు” అనేది ఒకటి. ఈ సామెతను మనం తరచుగా వింటుంటాం. ఇంతకీ దీని వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుందాం.

సామెత అర్థం ఏమిటి?

తనను ఇబ్బందిపెట్టిన వ్యక్తిపై కోపాన్ని నేరుగా చూపించలేక, సంబంధం లేని మరొక వ్యక్తిపై లేదా వస్తువుపై ఆ కోపాన్ని ప్రదర్శించడాన్ని ఈ సామెతతో పోలుస్తారు. అంటే ఒకరిపై ఉన్న ఆగ్రహాన్ని మరొకరిపై చూపించడం అన్నమాట. తన కోపాన్ని బలహీనులపై ప్రదర్శించిన అర్థంలో కూడా ఈ సామెతను వాడుతారు.

ఈ సామెత ఎలా వచ్చింది?

పూర్వం ఇళ్లలో మజ్జిగ, పెరుగు వంటి వాటిని నిల్వ చేసేందుకు మట్టితో చేసిన చిన్న కుండను ఉపయోగించేవారు. దానినే ‘దుత్త’ అంటారు. అత్త మీద కోపం వచ్చిన కోడలు ఆమెను ఏమీ అనలేక, తన చేతిలో ఉన్న దుత్తను నేలకేసి కొట్టి పగలగొట్టిందట. దీంతో అత్త మీద ఉన్న కోపాన్ని దుత్త మీద చూపించినట్లయింది. ఈ ఉదాహరణ నుంచే ఈ సామెత ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఎప్పుడు ఉపయోగిస్తారు?

ఆఫీస్ లేదా తాను పనిచేసే ప్రదేశంలో తన పై అధికారి తిట్టాడని ఇంటికి వచ్చి భార్యాపిల్లలపై చిరాకు పడేవారు ఉంటారు. అలాగే ఒక వ్యక్తి చేసిన తప్పుకు సంబంధం లేని మరో వ్యక్తిని నిందించడం కూడా ఈ సామెతకు సరిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో “అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు” అని అంటారు.

ఈ సామెతలోని నీతి ఏమిటి?

మనకు కోపం వచ్చినప్పుడు దానికి కారణమైన వ్యక్తితో సమస్యను పరిష్కరించుకోవాలి. అంతేకానీ, ఆ కోపాన్ని అమాయకులపై చూపించడం సరైన పద్ధతి కాదు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, ఇతరులను అనవసరంగా బాధించకుండా ఉండటం ఎంతో ముఖ్యం. అందుకే ఈ సామెత మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఒక్కటే.. ఒకరిపై ఉన్న కోపాన్ని మరొకరిపై లేదా బలహీనులపై చూపించకూడదు.

Also Read: ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?

Follow Us