
చియా సీడ్స్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇవి శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే.. చియా సీడ్స్ అనగానే చాలామందిలో అవి ఎలా ఉంటాయో.. వాటి రుచి ఎలా ఉంటుందో అనే అపోహలున్నాయి. కొందరు వాటిని స్పాంజీగా లేదా విత్తనాల్లాగా భావించి తీసుకోవడానికి వెనుకాడుతారు. కానీ చియా సీడ్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అపారమైనవి. మన పూర్వీకులు, తల్లిదండ్రులు ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరచడానికి, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడటానికి నిమ్మరసంతో లేదా కండచక్కరతో కలిపి చియా సీడ్స్‌ను నిత్యం ఉపయోగించేవారు. జ్వరం వచ్చినా, శరీరంలో వేడి పెరిగినా వెంటనే చియా సీడ్స్‌తో కూడిన పానీయాలు ఇచ్చేవారు.
వాస్తవానికి చియా సీడ్స్‌లో ఫైబర్, ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేవలం రెండు టేబుల్ స్పూన్ల (28 గ్రాముల) చియా గింజలలో సుమారు 138 కేలరీలు, 9.8 గ్రాముల ఫైబర్, 4.7 గ్రాముల ప్రొటీన్ లభిస్తాయని డైటీషియన్లు చెబుతున్నారు. ఇవి శరీర ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.
డీహైడ్రేషన్ నివారణ – శరీర వేడిని అదుపు: చియా సీడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే అవయవాలు నియంత్రించబడతాయి. ఇవి శరీరానికి దాహం వేయకుండా చూస్తాయి, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి. జ్వరం ఉన్నప్పుడు కూడా ఇవి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
రోగనిరోధక శక్తి పెంపు: కేవలం డీహైడ్రేషన్‌ను నివారించడమే కాకుండా, చియా సీడ్స్ రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) గణనీయంగా పెంచుతాయి. ఇది అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.
గుండె ఆరోగ్య సంరక్షణ: గుండె సంబంధిత సమస్యలు రాకుండా నియంత్రించడంలో చియా సీడ్స్ “సేఫ్టీ జోన్” లాగా పనిచేస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పోషకాల నిధి: చియా సీడ్స్‌లో కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, శరీరానికి అవసరమైన ఇతర పోషకాలకు చాలా ముఖ్యమైనవి. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల వచ్చే నీరసం, బలహీనత వంటి సమస్యలను ఇవి సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.
సహజమైన ఎనర్జీ బూస్టర్: బయట దొరికే కృత్రిమ శీతల పానీయాలు (థమ్స్ అప్, స్ప్రైట్, లిమ్కా వంటివి) తాగడానికి బదులుగా చియా సీడ్స్‌ను తీసుకోవడం ఎంతో మేలు. అవి శరీరానికి తక్షణ శక్తిని అందించి, ఆరోగ్యకరమైన రీతిలో హైడ్రేట్ చేస్తాయి. కొన్ని జ్యూస్ సెంటర్లలో లేదా ఫ్రూట్ సలాడ్లలో కూడా చియా సీడ్స్‌ను ప్రత్యేకంగా అడిగి వేయించుకుంటారు, వాటి ప్రాముఖ్యత అంతగా ఉంది.
చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చియా సీడ్స్‌ను అలవాటు చేసుకోవడం మంచిది. చాలామంది పిల్లలు చియా సీడ్స్ అంటే ఇష్టపడరు. అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు వాటి ప్రాముఖ్యతను వివరించి, డీహైడ్రేషన్ నుండి ఎలా కాపాడుతాయో, నీటి శాతాన్ని ఎలా పెంచుతాయో చెప్పాలి.
చియా సీడ్స్‌ను అన్ని కాలాల్లో కూడా తీసుకోవచ్చు. ఇవి ఏడాది పొడవునా షాపులలో అందుబాటులో ఉంటాయి. వాటిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.. చియా సీడ్స్ (Chia seeds) ఎప్పుడూ నేరుగా పొడిగా తినకూడదు. ఒక వాటర్ బాటిల్‌లో లేదా గిన్నెలో నీరు పోసి చియా సీడ్స్‌ను కలపాలి. రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకోవచ్చు. లేదా ఉదయం నానబెట్టి సాయంత్రం వరకు తీసుకోవచ్చు. ఇంకా అర్జెంటుగా తీసుకోవాలంటే.. ముందుగా కనీసం 15 నుండి 30 నిమిషాలు నీరు, పాలు లేదా జ్యూస్‌లో నానబెట్టి తీసుకోవాలి.. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల ఇవి జెల్ లాగా మారుతాయి.. తద్వారా సులభంగా జీర్ణమవుతాయి.. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పనులు చేసుకునే సమయంలో శరీరానికి నీరు అవసరమైనప్పుడు లేదా దాహం వేసినప్పుడు వెంటనే నీరు తాగడానికి సమయం లేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చియా సీడ్స్ కలిపిన నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు. అంతేకాదు, కొందరు గుడ్లు లేదా చికెన్ వంటి ఆహారాలు తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుందని భావిస్తారు. అలాంటి వారు కూడా చియా సీడ్స్‌ను తీసుకోవడం ద్వారా శరీర వేడిని నియంత్రించుకోవచ్చు. ఇలా రోజులో ఎప్పుడైనా.. చియా సీడ్స్ ను తీసుకోవచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..