
చలికాలం రాగానే మన దినచర్యలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా పగటి సమయం తగ్గి సాయంత్రం త్వరగా చీకటి పడటం వల్ల మన శరీరంలోని అంతర్గత గడియారం లేదా సర్కాడియన్ రిథమ్ ప్రభావితమవుతుంది. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారంతో పాటు, భోజనం చేసే సమయం కూడా ఎంతో ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో రాత్రి భోజనాన్ని రాత్రి 7 గంటల నుండి 8 గంటల లోపు పూర్తి చేయడం అత్యుత్తమం. వీలైతే నిద్రపోవడానికి కనీసం 2 నుండి 3 గంటల ముందు భోజనం ముగించాలి. చలి కారణంగా ఆలస్యంగా తినడం లేదా అతిగా తినడం వంటి అలవాట్లు జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని పెంచుతాయి.
సూర్యాస్తమయం తర్వాత శరీరంలో జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్‌ల చురుకుదనం క్రమంగా తగ్గుతుంది. చలికాలంలో చీకటి త్వరగా పడటం వల్ల జీర్ణక్రియ వేగం కూడా తగ్గుతుంది. త్వరగా భోజనం చేస్తే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత శరీరంలో ఇన్సులిన్ పనితీరు మందగిస్తుంది. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ తప్పే అవకాశం ఉంటుంది. కొవ్వు నిల్వలు పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది.
చీకటి పడగానే శరీరంలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. భోజనం చేసిన వెంటనే పడుకుంటే యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ వంటి సమస్యలు వచ్చి నిద్రకు ఆటంకం కలుగుతుంది. భోజనం, నిద్ర మధ్య తగినంత వ్యవధి ఉంటే గాఢ నిద్ర లభిస్తుంది.
చలికాలంలో రాత్రిపూట వేడిగా, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. కూరగాయల సూప్‌లు, పప్పుచారు, మితంగా అన్నం లేదా చపాతీ వంటివి మంచి ఎంపికలు. వేయించిన పదార్థాలు, అధిక మసాలాలు, చల్లని ఆహార పదార్థాలను రాత్రి వేళల్లో తగ్గించడం మంచిది. సరైన సమయంలో సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా చలికాలంలో వచ్చే జీర్ణ సమస్యలను సులభంగా అధిగమించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..