
చాలామందికి రాత్రిపూట సాక్సులు వేసుకుని నిద్రపోవడం అంటే కాస్త అసౌకర్యంగానో లేదా వింతగానో అనిపిస్తుంది. కానీ మీరు త్వరగా నిద్రలోకి జారుకోవాలన్నా, రాత్రంతా హాయిగా నిద్రపోవాలన్నా సాక్సులు ధరించడం ఒక అద్భుతమైన మార్గమని పరిశోధకులు చెబుతున్నారు. నిద్రలేమికి మందులు వాడేకంటే ఈ చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది. పరిశోధనల ప్రకారం.. సాక్సులు ధరించని వారితో పోలిస్తే సాక్సులు వేసుకునే వారు సుమారు 15 నిమిషాలు ముందుగానే నిద్రలోకి జారుకుంటారు. మన పాదాలు వెచ్చగా ఉన్నప్పుడు రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఇది శరీర అంతర్గత ఉష్ణోగ్రతను తగ్గించడానికి మెదడుకు సంకేతాలను పంపుతుంది. శరీరం చల్లబడటం మొదలవ్వగానే, మనం నిద్రకు సిద్ధంగా ఉన్నామని మెదడు గ్రహించి హాయిగా నిద్రపోయేలా చేస్తుంది.
రాత్రిపూట కాళ్లు చల్లబడటం వల్ల చాలామందికి మధ్యలో మెలకువ వస్తూ ఉంటుంది. సాక్సులు వేసుకోవడం వల్ల పాదాల ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. దీనివల్ల రాత్రంతా ఎటువంటి అంతరాయం లేకుండా గాఢ నిద్ర పడుతుంది.
కేవలం నిద్ర మాత్రమే కాదు, పాదాల అందానికి కూడా ఇది ఒక మంచి చిట్కా. రాత్రి పడుకునే ముందు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకుని, కాటన్ సాక్సులు ధరిస్తే పాదాల పగుళ్లు తగ్గి, చర్మం ఎంతో మృదువుగా మారుతుంది. ముఖ్యంగా చలికాలంలో చేతులు, పాదాలకు రక్త ప్రసరణ తగ్గి ఇబ్బంది పడేవారికి సాక్సులు వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ క్రమబద్ధీకరించబడుతుంది.
సాక్సులు మరీ టైట్‌గా ఉంటే రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి కాస్త వదులుగా ఉండేలా చూసుకోండి. ఉన్ని సాక్సులు ఎక్కువగా వేడిని కలిగిస్తాయి, దీనివల్ల పాదాలు అతిగా వేడెక్కి నిద్రకు భంగం కలగవచ్చు. కాటన్ సాక్సులు ఉత్తమం. పగలంతా వాడిన సాక్సులను రాత్రి వేసుకోకండి. శుభ్రంగా ఉన్న సాక్సులనే ధరించండి.