జామపండు vs అరటిపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..? 90శాతం మందికి తెలియని సీక్రెట్స్ ఇవే..

అరటిపండు, జామపండు.. ఈ రెండు కూడా మనకు చౌకగా, సులభంగా దొరికే ఆరోగ్య వరాలు. కానీ, అందరికీ ఇవి ఒకేలా మేలు చేయవు. ఒకవైపు జామపండు విటమిన్-సి ఖజానాగా ఉంటే, మరోవైపు అరటిపండు పొటాషియం పవర్‌హౌస్‌గా నిలుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? తక్కువ క్యాలరీలు ఉండే సూపర్ ఫ్రూట్ ఏది? అనేది తెలుసుకుందాం..

జామపండు vs అరటిపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..? 90శాతం మందికి తెలియని సీక్రెట్స్ ఇవే..
Banana Vs Guava

Updated on: Jun 24, 2026 | 7:20 AM

బరువు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మన రోజువారీ డైట్‌లో పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. అయితే నిత్యం మనకు అందుబాటులో ఉండే పండ్లలో ఏది ఉత్తమమైనది అనే విషయంలో చాలా మందికి గందరగోళం ఉంటుంది. ముఖ్యంగా అందరూ ఎక్కువగా ఇష్టపడే అరటిపండు, జామపండ్లలలో ఏది ఎక్కువ ఆరోగ్యకరం..? రెండింటిలో దేనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? అనే ఆసక్తికరమైన నిజాలను తెలుసుకోవడం అందరికీ అవసరం.

పోషకాల ఖజానా: దేనిలో ఏముంది?

జామపండు: ఇది విటమిన్ సి కి కేరాఫ్ అడ్రస్. రోజుకు ఒక జామపండు తింటే, శరీరానికి కావలసిన దానికి కంటే రెట్టింపు విటమిన్ సి అందుతుంది. అంతేకాదు ఇందులో డైటరీ ఫైబర్ , ఫోలేట్, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అరటిపండుతో పోలిస్తే ఇందులో క్యాలరీలు, షుగర్ లెవెల్స్ చాలా తక్కువ.

అరటిపండు: ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది గుండె పనితీరును, కండరాల నియంత్రణను మెరుగుపరుస్తుంది. దీంతో పాటు విటమిన్ బి6, విటమిన్ సి, మాంగనీస్ ఉంటాయి. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఎక్కువ కాబట్టి, ఇది తిన్న వెంటనే శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్?

మీరు బరువు తగ్గాలి లేదా క్యాలరీలను నియంత్రణలో ఉంచుకోవాలి అనుకుంటే జామపండు అద్భుతమైన ఎంపిక. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి, పీచు పదార్థంఎక్కువగా ఉండటం వల్ల ఇది తిన్న తర్వాత చాలా సేపటి వరకు ఆకలి వేయదు. మరోవైపు అరటిపండులో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారు దీని పరిమాణాన్ని తగ్గించి తినాలి. అయితే జిమ్‌కు వెళ్లేవారికి లేదా వర్కౌట్ చేసేవారికి ప్రీ, పోస్ట్ వర్కౌట్ స్నాక్‌గా అరటిపండు తక్షణ శక్తిని ఇస్తుంది.

గ్లైసిమిక్ ఇండెక్స్

జామపండు: దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే ఇది తిన్న తర్వాత రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి ఇది అమృతం లాంటిది.

అరటిపండు: దీని GI మీడియంగా ఉంటుంది. బాగా పండిన అరటిపండు తింటే షుగర్ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి. కాబట్టి షుగర్ ఉన్నవారు కాస్త పచ్చగా, పూర్తిగా పండని అరటిపండ్లను తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

జీర్ణక్రియ – గుండె ఆరోగ్యం: జామపండులోని పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని లైకోపీన్ గుండెను రక్షిస్తుంది. అలాగే, ఇది బ్రెయిన్ ఫంక్షన్‌ను పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది.

బీపీ – నిద్రలేమి సమస్యలు: అరటిపండులోని పొటాషియం హైపర్ టెన్షన్, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ శరీరంలో సెరటోనిన్ స్థాయిలను పెంచి, మంచి మూడ్, హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది.

ఎవరు ఏ పండుకు దూరంగా ఉండాలి?

కిడ్నీ సమస్యలు ఉన్నవారు: కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు అరటిపండుకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులోని అధిక పొటాషియం కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతుంది.

IBS లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి జామపండులోని గింజలు, ఫైబర్ కడుపులో అసౌకర్యాన్ని కలిగించవచ్చు.

మధుమేహ బాధితులు: షుగర్ ఉన్నవారు ఈ రెండు పండ్లను కూడా అమితంగా కాకుండా మితంగానే తీసుకోవాలి.

మీరు తక్కువ క్యాలరీలు, ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు, మెరుగైన జీర్ణక్రియ కోసం చూస్తుంటే జామపండు బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా తక్షణ శక్తి, బీపీ నియంత్రణ, వర్కౌట్ స్నాక్ కావాలనుకుంటే అరటిపండు ఉత్తమమైనది.

Follow Us