రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే మానేయండి

ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పోషకాహారం తీసుకోవడం మాత్రమే సరిపోదు. ఆహారం తీసుకున్న తర్వాత పాటించే అలవాట్లు కూడా ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతాయి. చాలా మంది భోజనం చేసిన వెంటనే పడుకోవడం, కఠినమైన వ్యాయామం చేయడం, అధికంగా నీరు తాగడం లేదా మొబైల్, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోవడం వంటి అలవాట్లు కలిగి ఉంటారు. అయితే ఇవి జీర్ణక్రియను దెబ్బతీసే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే మానేయండి
After Meal Mistakes

Updated on: Jul 15, 2026 | 1:25 PM

సాధారణంగా భోజనం చేసిన తర్వాత శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడం, అందులోని పోషకాలను గ్రహించడం వంటి ప్రక్రియలపై దృష్టి పెడుతుంది. ఈ సమయంలో కొన్ని తప్పు అలవాట్లు పాటిస్తే కడుపు ఉబ్బరం, అజీర్ణం, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

భోజనం తర్వాత చేయకూడని పనులు

వెంటనే కఠినమైన వ్యాయామం చేయకండి

భోజనం చేసిన వెంటనే జిమ్‌కు వెళ్లడం, పరుగులు తీయడం లేదా అధిక శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం వల్ల కడుపు నొప్పి, వికారం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. కనీసం భోజనం చేసిన తర్వాత 1.5 నుంచి 2 గంటల విరామం తీసుకుని వ్యాయామం చేయడం ఉత్తమం.

వెంటనే పడుకోవడం ప్రమాదకరం

ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. నిపుణుల సూచనల ప్రకారం భోజనం చేసిన తర్వాత కనీసం 2 నుంచి 3 గంటల తర్వాత మాత్రమే నిద్రపోవడం మంచిది.

అధికంగా నీళ్లు తాగవద్దు

భోజనం చేస్తున్న సమయంలో లేదా వెంటనే ఎక్కువ నీరు తాగడం వల్ల కొందరికి కడుపు నిండిపోయిన భావన, ఉబ్బరం, అసౌకర్యం కలగవచ్చు. అవసరమైతే కొద్దికొద్దిగా నీరు తాగడం మంచిది.

పొగతాగడం, మద్యం సేవించడం వెంటనే మానండి

భోజనం చేసిన వెంటనే పొగతాగడం లేదా మద్యం సేవించడం జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇవి కడుపు పొరను దెబ్బతీయడంతో పాటు జీర్ణక్రియను మరింత మందగింపజేస్తాయి.

అతిగా తినవద్దు

అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రైటిస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మితంగా తినే అలవాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి?

  • భోజనం చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవండి.
  • ఆహారాన్ని బాగా నమిలి తినే అలవాటు పెంపొందించుకోండి.
  • భోజనం చేసిన వెంటనే గంటల తరబడి మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ముందు కూర్చోవద్దు.
  • పండ్లను భోజనం చేసిన వెంటనే కాకుండా ఒకటి లేదా రెండు గంటల తర్వాత తీసుకోవడం మంచిది.
  • ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేసే అలవాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

భోజనం తర్వాత తరచుగా గుండెల్లో మంట, గ్యాస్ట్రైటిస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతున్నట్లయితే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు పదేపదే కనిపిస్తే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లేదా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించడం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఆహారం తర్వాత సరైన జీవనశైలి అలవాట్లు పాటించడం కూడా అంతే ముఖ్యం. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు లేదా వైద్య సలహాల కోసం తప్పనిసరిగా అందుబాటులో ఉన్న వైద్యుడిని సంప్రదించండి.

Follow Us