
చికెన్ అంటే చాలు.. నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి తింటారు.. చికెన్ ఫ్రై, కర్రీ, తందూరి, చికెన్ పచ్చడి.. ఇలా ఎన్నో రకాలుగా చేసుకుని ఇష్టంగా తింటారు. అయితే.. కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు.. అవును.. చాలా మంది డైలీ నాన్ వెజ్ తినడాన్ని ఇష్టపడతారు.. ఇక కొందరైతే డైలీ చికెన్ ను తింటారు.. చికెన్ లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. మంచి ప్రోటీన్ వనరుగా కోడి మాంసం గుర్తింపు పొందింది.. అయితే ప్రతిరోజూ చికెన్ తినడం ఆరోగ్యకరమేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. డైటీషియన్ల ప్రకారం.. చికెన్ మంచిదే అయినప్పటికీ, దానిని ప్రతిరోజూ తీసుకోవడం సరికాదని సూచించారు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు, లేదా గరిష్టంగా మూడుసార్లు మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి ప్రయోజనకరమని పేర్కొంటున్నారు.
చికెన్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి: దేశీ చికెన్ (నాటు కోడి), బాయిలర్ చికెన్. పోషకపరంగా దేశీ చికెన్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంటున్నారు. దేశీ చికెన్‌లో ప్రోటీన్ కంటెంట్ బాయిలర్ చికెన్ కంటే అధికంగా ఉంటుంది. ఉదాహరణకు, దేశీ చికెన్‌లో 100 గ్రాముల ప్రోటీన్ లభిస్తే, బాయిలర్ చికెన్‌లో కేవలం 50-60 గ్రాముల వరకు మాత్రమే లభించే అవకాశం ఉంది. అధిక ప్రోటీన్ కలిగిన దేశీ చికెన్ శరీరాన్ని బలోపేతం చేయడానికి, వెన్నెముకకు మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుంది. అయితే.. బ్రాయిలర్ చికెన్ తో పోలిస్తే.. దేశీ చికెన్ ధర ఎక్కువగా ఉంటుంది. ఇటు ఆర్థికంగా.. అటు శరీర అవసరాలకు అనుగుణంగా చికెన్ ను ఎంచుకోవడం ఉత్తమం..
చికెన్ తయారీ పద్ధతి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రోటీ, ఉడకబెట్టిన, గ్రిల్డ్ లేదా తందూరి చికెన్ వంటివి తీసుకోవచ్చు.. కానీ అధికంగా మసాలాలు వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ వండేటప్పుడు రుచి, వాసన కోసం చాలామంది మసాలాలను అధికంగా ఉపయోగిస్తారు. అయితే, ఈ మసాలాలు క్యాన్సర్ కణాల పెరుగుదలకు దారితీయవచ్చని, క్యాన్సర్ లేనివారిలో కూడా దీనికి అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని నివారించడానికి, రుచి కోసం ఇంట్లో తయారుచేసిన ధనియాల పొడి, మిరియాల పొడి, కరివేపాకు పొడి వంటి సహజ మసాలాలను ఉపయోగించవచ్చు.. బయట లభించే ప్యాక్డ్ మసాలాలను వీలైనంతవరకు తగ్గించడం మంచిది.
ప్రతిరోజూ చికెన్ తినడం వల్ల శరీరం దానిని భరించలేకపోవచ్చు.. జీర్ణక్రియ సమస్యలు తలెత్తవచ్చు. కొందరు “చికెన్ తింటే వేడి చేస్తుంది” లేదా “పడట్లేదు” అని చెబుతుంటారు. దీనికి కారణం తరచుగా అధిక మసాలాలు, నూనెతో కూడిన వంటకాలు లేదా రోజువారీ తీసుకోవడమేనని నిపుణులు పేర్కొంటున్నారు.. అధికంగా తీసుకుంటే జీర్ణం కాకపోవడమే కాకుండా, చికెన్‌పై ఆసక్తి కూడా తగ్గిపోతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..