
ఈ గడియారం కేవలం సమయాన్ని చూపడమే కాదు, ప్రకృతిపై అనంత్‌కు ఉన్న ప్రేమను కూడా చాటిచెబుతుంది. దీని డయల్ మధ్యలో అనంత్ అంబానీకి చెందిన ఒక చిన్న హ్యాండ్-పెయింటెడ్ బొమ్మ ఉంటుంది. దాని చుట్టూ సింహం బెంగాల్ పులి బొమ్మలు కొలువుదీరి ‘వంటారా’ లక్ష్యాన్ని గుర్తుచేస్తాయి. 400కి పైగా విలువైన రత్నాలతో అడవిని తలపించేలా గ్రీన్ కామఫ్లేజ్ డిజైన్ చేయడం ఈ వాచ్‌లోని ప్రధాన ఆకర్షణ. ఇది వాచ్ కంటే కూడా ఒక ‘వేరబుల్ ఆర్ట్’ (ధరించగలిగే కళాఖండం) అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
వాచ్ ప్రత్యేకతలు ఇవే:
రత్నాల హారం: ఈ వాచ్ తయారీలో మొత్తం 397 రత్నాలను (21.98 క్యారెట్లు) ఉపయోగించారు. ఇందులో అరుదైన డిమాంటోయిడ్ గార్నెట్స్, త్సావోరైట్స్, గ్రీన్ సఫైర్స్ మరియు డైమండ్స్ ఉన్నాయి.
మెకానికల్ వండర్: ఇందులో మూడు అక్షాల (Triple-axis) టూర్‌బిలాన్ మెకానిజం ఉంటుంది. వాచ్‌లోని మ్యూజిక్ బాక్స్ ప్లే అయినప్పుడు, డయల్ లోపల ఉన్న అనంత్, సింహం పులి బొమ్మలు గాలిలో తిరుగుతూ కనిపిస్తాయి.
వంటారా లోగో: వాచ్ పైన ఏనుగు తలతో కూడిన ‘వంటారా’ లోగోను బంగారం రంగులో ముద్రించారు.
సెలిబ్రిటీ బ్రాండ్: జాకబ్ అండ్ కో బ్రాండ్ అంటే క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ వంటి దిగ్గజాలకు ఫేవరెట్. గతంలో ఇదే బ్రాండ్ అనంత్ కోసం ‘రామ్ జన్మభూమి’ ఎడిషన్ వాచ్‌ను కూడా తయారు చేసింది.
నెటిజన్ల కామెంట్స్:
ఈ వాచ్ ధర డిజైన్ చూసి సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వస్తున్నాయి. “ఇందులో అన్నీ కనిపిస్తున్నాయి కానీ సమయం ఎక్కడ ఉందో వెతకాలి” అని కొందరు సరదాగా వ్యాఖ్యానించగా, “జంతు ప్రేమికులకు ఇది గొప్ప నివాళి” అని మరికొందరు కొనియాడుతున్నారు.