
ప్రస్తుత ఆధునిక కాలంలో అందాన్ని ఇనుమడింపజేసే అనేక రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో 24కే గోల్డ్ సీరమ్ ఒకటి. ముఖానికి బంగారు కాంతిని ఇస్తుందనే ప్రచారంతో ఇది మహిళలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఈ సీరమ్ చర్మానికి నిజంగానే అంత ప్రయోజనం చేకూరుస్తుందా? దీని వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? అనే విషయాలను చర్మ నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
ఇది కేవలం బంగారు రేకులు లేదా నానో-గోల్డ్ కణాలతో తయారైన ఒక కాస్మెటిక్ సీరమ్. చర్మానికి తక్షణ మెరుపును, విలాసవంతమైన అనుభూతిని అందించడానికి దీనిని రూపకల్పన చేశారు. పురాతన కాలం నుంచి రాణులు సౌందర్య పోషణకు బంగారాన్ని ఉపయోగించారనే నమ్మకం దీని వెనుక ఉంది.
చర్మంపై గోల్డ్ సీరమ్ రాసి సున్నితంగా మర్దన చేయడం ద్వారా రక్తనాళాలు ఉత్తేజితమై, ముఖ కణాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. వృద్ధాప్య లక్షణాలైన ముడతలు, సన్నని గీతలు వంటి వాటిని నివారించడంలో, చర్మం సాగే గుణాన్ని కాపాడడంలో ఇది సహకరిస్తుంది. చర్మానికి తక్షణమే గ్లో రావడానికి, పొడిబారిన చర్మాన్ని మృదువుగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది.
చాలామంది కేవలం బంగారమే అద్భుతాలు చేస్తుందని భావిస్తారు. కానీ చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం, గోల్డ్ సీరమ్‌లలో ఉండే హైల్యూరోనిక్ యాసిడ్, విటమిన్ సి, నియాసినమైడ్, పెప్టైడ్స్ వంటి ఇతర సమ్మేళనాలే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. బంగారం అనేది కేవలం ఆ ప్రొడక్ట్‌కు అందాన్ని, గ్లోను ఇవ్వడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది.
బంగారంతో తయారయ్యే అన్ని సీరమ్‌లు అందరికీ పడవు. ముఖ్యంగా సున్నితమైన చర్మం లేదా మొటిమల సమస్య ఉన్నవారు వీటిని వాడే ముందు అలెర్జీ పరీక్ష చేసుకోవడం అత్యంత ముఖ్యం. లేకపోతే చర్మంపై దద్దుర్లు లేదా అలెర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మంచి బ్రాండ్ ఉత్పత్తులను ఎంచుకోవడం ఎప్పుడూ సురక్షితం.