AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొనొద్దని తిడతాడు.. అయినా అతడి షాపుకే క్యూ కడుతున్నారు! ఇదేం క్రేజ్ బాసూ!

సాధారణంగా షాపుకు వెళ్లినప్పుడు వ్యాపారులు కస్టమర్లను ఎంతో మర్యాదగా పలకరిస్తారు. తమ వస్తువుల గురించి గొప్పగా చెబుతారు. ఏదో ఒకటి కొనకుండా వెళ్లనివ్వరు. కానీ దక్షిణ కొరియాలో ఓ వ్యాపారి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. తన షాపుకు వచ్చిన కస్టమర్లను చూస్తే చాలు 'ఏం కొనడానికి వచ్చారు? మా దగ్గర ఉన్నవన్నీ నాసిరకం వస్తువులే దయచేసి కొనకండి' అంటూ వెటకారంగా మాట్లాడతాడు. స్కార్ఫ్‌లు చూపించమని అడిగితే చిరాకు పడతాడు. కొనుగోలుదారులపై జోకులు వేస్తాడు. అయినా ఆయన షాపు ముందు మాత్రం జనం బారులు తీరుతున్నారు.

కొనొద్దని తిడతాడు.. అయినా అతడి షాపుకే క్యూ కడుతున్నారు! ఇదేం క్రేజ్ బాసూ!
Dont Buy My Products South Koreas Viral Scarf Seller Draws Huge Crowds
Sharada V
|

Updated on: Nov 16, 2026 | 10:04 AM

Share

సాధారణంగా షాపుకు వెళ్లినప్పుడు వ్యాపారులు కస్టమర్లను ఎంతో మర్యాదగా పలకరిస్తారు. తమ వస్తువుల గురించి గొప్పగా చెబుతారు. ఏదో ఒకటి కొనకుండా వెళ్లనివ్వరు. కానీ దక్షిణ కొరియాలో ఓ వ్యాపారి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. తన షాపుకు వచ్చిన కస్టమర్లను చూస్తే చాలు ‘ఏం కొనడానికి వచ్చారు? మా దగ్గర ఉన్నవన్నీ నాసిరకం వస్తువులే దయచేసి కొనకండి’ అంటూ వెటకారంగా మాట్లాడతాడు. స్కార్ఫ్‌లు చూపించమని అడిగితే చిరాకు పడతాడు. కొనుగోలుదారులపై జోకులు వేస్తాడు. అయినా ఆయన షాపు ముందు మాత్రం జనం బారులు తీరుతున్నారు. గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. కొందరైతే వేరే ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ప్రయాణించి వస్తున్నారు. ఆశ్చర్యంగా ఉందా? అసలు ఆయన అమ్మే స్కార్ఫ్‌ల కోసం కాదు. ఆయన చేసే కామెడీ, వెటకారపు మాటలు వినడం కోసం! సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ వింత వ్యాపారి కథ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ప్రసిద్ధ నామ్‌డేమున్ మార్కెట్‌లో ఓ చిన్న స్కార్ఫ్‌ల దుకాణం ఉంది. అక్కడ వ్యాపారం చేసే వ్యక్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘స్కార్ఫ్ మ్యాన్’గా ఫేమస్ అయ్యాడు. ఆయన షాపుకు వెళ్లిన కస్టమర్లకు ఎదురయ్యే అనుభవం మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది.

‘మా దగ్గర దొరికేవన్నీ నాసిరకం వస్తువులని తెలిసే వచ్చారా? మీ కుక్కల ఇళ్లకు కట్టడానికి స్కార్ఫ్‌లు కొనడానికి వచ్చారా?’ అంటూ కస్టమర్లను ఆటపట్టిస్తుంటాడు. ఎవరైనా ఏదైనా వస్తువు చూపించమని అడిగితే వెటకారంగా సమాధానాలు చెబుతాడు. వారి షాపింగ్ అలవాట్లపై జోకులు వేస్తాడు. ఒక్కోసారి ఈ వ్యాపారం మానేస్తే ప్రశాంతంగా ఉంటుందని కూడా అంటుంటాడు.

ఆయన మాటలు వింటే ఎవరికైనా షాపు నుంచి పారిపోవాలి అనిపిస్తుంది. కానీ ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్ సైకాలజీగా పని చేసింది! ఆయన ఎంతగా వద్దంటున్నా కస్టమర్లు మాత్రం ఆయన్ను చూడటానికి, ఆయన మాటలు వినడానికి క్యూ కడుతున్నారు. ఈ వింత మార్కెటింగ్ స్టైల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆరు స్కార్ఫ్‌లు కేవలం రూ.600.. అసలు ఆకర్షణ వేరే!

స్కార్ఫ్ మ్యాన్ అమ్మే వస్తువుల ధరలు కూడా చాలా తక్కువే. ఆరు స్కార్ఫ్‌లను కలిపి 10,000 దక్షిణ కొరియా వోన్‌లకు విక్రయిస్తాడు. అంటే సుమారు 7 డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.600 మాత్రమే. అయితే ఆయన షాపుకు వస్తున్న వారిలో చాలా మందికి స్కార్ఫ్‌లు కొనాలనే ఆసక్తి ఉండటం లేదు. ఆయనతో సరదాగా మాట్లాడాలని, ఆయన చేసే కామెడీని ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నారు. కొందరు విదేశీ పర్యాటకులకైతే ఆయన మాట్లాడే కొరియన్ భాష అర్థం కూడా కాదు. అయినా సరే ఆయనను ఒక్కసారి చూడాలనే ఉత్సాహంతో క్యూలో నిలబడుతున్నారు. అంటే ఇక్కడ వస్తువుల కంటే వాటిని అమ్మే వ్యక్తికే ఎక్కువ డిమాండ్ అన్నమాట!

Dont Buy My Products South Koreas Viral Scarf Seller Draws Huge Crowds Anyway

Dont Buy My Products South Koreas Viral Scarf Seller Draws Huge Crowds Anyway

24 గంటల్లోనే ఖాళీ అయిన ఆన్‌లైన్ స్టోర్!

స్కార్ఫ్ మ్యాన్ కస్టమర్లతో చేసే వింత సంభాషణలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు లక్ష మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌లోనూ ఆయన వీడియోలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రేజ్‌ను చూసి ఆయన కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ స్టోర్ కూడా ప్రారంభించారు. దీంతో సియోల్‌కు వెళ్లలేని వారు ఇంటి నుంచే స్కార్ఫ్‌లు కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన మొదటి విడత వస్తువులన్నీ కేవలం 24 గంటల్లోనే అమ్ముడైపోయాయి. ఆర్డర్లు ఊహించని స్థాయిలో పెరగడంతో వాటిని రద్దు చేసుకోవాలని ఆయనే కస్టమర్లను కోరాల్సి వచ్చింది.

అయినా అభిమానుల ఉత్సాహం తగ్గలేదు. ఆన్‌లైన్‌లో కొనడం కంటే నేరుగా షాపుకు వెళ్లి స్కార్ఫ్ మ్యాన్‌ను కలవాలని చాలామంది భావిస్తున్నారు. కొందరు దూర ప్రాంతాల నుంచి వచ్చినా షాపు మూసి ఉండటంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. మరికొందరు ఆలస్యంగా వెళ్లడంతో ఆ రోజు కస్టమర్లను అప్పటికే పంపించేశారని తెలుసుకుని నిరాశ చెందుతున్నారు.

గంటన్నర ప్రయాణం చేసి మరీ వస్తున్నారు.. స్కార్ఫ్‌ల కోసం కాదు!

సియోల్‌కు చెందిన అహ్న్ హ్యో-సన్ అనే మహిళ స్కార్ఫ్ మ్యాన్ వీడియోలను పదే పదే చూసి ఆయన షాపుకు వెళ్లారు. అయితే అక్కడికి చేరుకునే సమయానికి ఆయన కనిపించలేదు. అంతకుముందు ఆయన గొంతు వినిపించడంతో షాపులోనే ఉన్నారని భావించి ఎంతో ఉత్సాహపడ్డానని ఆమె చెప్పారు.ఆయన మాట్లాడే విధానం చాలా సరదాగా ఉంటుందని, ఆయన వీడియోలు చూస్తే మనసుకు మంచి ఉత్సాహం వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లో ఉండే హాస్యం చాలా మందిని ఆకట్టుకుంటోందని తెలిపారు.

ఇక ఇంచియాన్ ప్రాంతానికి చెందిన చో యూన్-సూక్ అనే మరో మహిళ ఏకంగా గంటన్నర ప్రయాణించి ఆయన షాపుకు వచ్చారు. గతంలో ఒకసారి వచ్చినా ఆలస్యంగా రావడంతో ఆయనను కలవలేకపోయారు. అయినా పట్టువదలకుండా మరోసారి ప్రయత్నించారు. ‘ఇంత దూరం వచ్చి చూడాలని నిర్ణయించుకున్నాను. కనీసం ఒక్కసారైనా ఆయనను కలవాలి’ అని చెప్పారు. తనకు స్కార్ఫ్‌లపై పెద్దగా ఆసక్తి లేదని, ఆ వ్యాపారిని చూడటమే ముఖ్యమని ఆమె చెప్పడం విశేషం.

అతను చేసే సరదా వ్యాఖ్యలు, చమత్కారాలు ఉత్సాహాన్ని ఇచ్చాయనీ ఆయన మాట్లాడే తీరు, అప్పుడప్పుడు బూతులు కలిపి చేసే వ్యాఖ్యలు  నవ్వించాయనీ ఆమె అన్నారు.  ఆయన మాటలను ఎంతో హాస్యంగా మాట్లాడే బామ్మల చమత్కారాలతో పోల్చారు. ‘ఆయన చేసే సరదా సంభాషణలు విన్నవారికి ఒకరకమైన ఆనందం కలుగుతుంది. రోజువారీ జీవితంలోని ఒత్తిడిని మర్చిపోయి కాసేపు నవ్వుకునే అవకాశం లభిస్తుంది’ అని చెప్పారు.

మీడియా ఇంటర్వ్యూలకూ దూరం!

ఇంతటి పాపులారిటీ వచ్చినా స్కార్ఫ్ మ్యాన్ వ్యక్తిగత వివరాలు మాత్రం చాలా వరకు రహస్యంగానే ఉన్నాయి. ఆయన అసలు పేరు కూడా చాలా మందికి తెలియదు. ఓ సోషల్ మీడియా లైవ్‌లో తనకు భార్య, పిల్లలు ఉన్నారని, చాలా ఏళ్లుగా నామ్‌డేమున్ మార్కెట్‌లో వివిధ రకాల వస్తువులు విక్రయిస్తున్నానని వెల్లడించారు.

ఆయన షాపు ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూసేస్తారో కూడా కచ్చితంగా తెలియదు. ఇంతటి క్రేజ్ వచ్చినా ఆయన మాత్రం సెలబ్రిటీగా మారాలని ఆసక్తి చూపడం లేదు. మీడియా ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటున్నారు.

వస్తువుల కంటే వ్యక్తే బ్రాండ్‌గా మారితే!

సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఎవరైనా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోతున్నారు. కానీ దక్షిణ కొరియాకు చెందిన ఈ స్కార్ఫ్ మ్యాన్ మాత్రం అందరికంటే భిన్నం. తన వస్తువులు కొనమని అడగడం లేదు. పైగా కొనొద్దంటూ కస్టమర్లను ఆటపట్టిస్తున్నాడు. అయినా ఆయన షాపు ముందు జనం తగ్గడం లేదు. ఆయన వెటకారపు మాటలే ఇప్పుడు ఆయనకు పెద్ద ప్రచారంగా మారాయి.

మొత్తానికి, వ్యాపారంలో కస్టమర్లను ఆకర్షించడానికి పెద్ద పెద్ద ప్రకటనలు, ఆఫర్లు అవసరం లేదని ఈ స్కార్ఫ్ మ్యాన్ నిరూపిస్తున్నాడేమో! వస్తువుల నాణ్యత గురించి చెప్పకుండా, తనదైన హాస్యంతోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘నా దగ్గర ఏమీ బాగుండవు.. కొనొద్దు’ అని ఆయన ఎంతగా చెబుతున్నా అభిమానులు మాత్రం ‘మీరు కనిపిస్తే చాలు’ అన్నట్లుగా షాపు ముందు క్యూ కడుతున్నారు!

Follow Us