Holi Celebrations: రంగులనేవి లేకపోతే ఈ ప్రపంచం అంత బాగుండేది కాదేమో! బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తున్నట్టుగా ఉండేది! అన్ని జంతువులూ జీబ్రాలా నలుపు తెలుపులో కనిపించేవి.. అన్ని పర్వతాలు.. అన్ని నదులు.. అన్ని సరస్సులు నల్లగా అగుపించేవి.. అలాగైతే మనకు చచ్చేంత చిరాకు పుడుతుంది కాబట్టే సృష్టికర్త అందమైన లోకాన్ని సృష్టిస్తున్నప్పుడే రంగులిచ్చాడు.. ఆ రంగులతో పండుగ చేసుకోమన్నాడు. ఆ పండుగ కూడా వసంతంలోనే జరుపుకోమన్నాడు. ఆయన ఆదేశించిన తర్వాత జరుపుకోకుండా ఎలా ఉంటాం! అందుకే రంగుల పండుగను జరుపుకుంటున్నాం. ఆ ఉత్సవమే ఫాల్గుణోత్సవం. అదే వసంతోత్సవం. ఆ వసంతాగమనానికి ఒక్కో చోట ఒక్కోలా స్వాగతం పలుకుతూ సంబరపడిపోతున్నాం. కల్యాణ పూర్ణమ అన్నా, డోలా పున్నమి అన్నా, హుతశనీ పూర్ణిమ అన్నా, కాముని పున్నమి అన్నా, అనంతపూర్ణిమ అన్నా అదే వేడుక.. అదే రంగుల వెదజల్లిక. హోలీ అన్నది మాత్రం జగద్విఖ్యాతి గడిచింది..
పండుగంటే సంబరం, సంతోషం, ఉత్సవం, ఉత్సాహం, ఓ వేడుక, ఓ తీపి జ్ఞాపిక, ఓ ఆనందవీచిక. యాంత్రికంగా సాగిపోయే జీవితాలలో పండుగ ఒక ఆటవిడుపు. మనం అన్ని పండుగలనూ ఆనందంగానే జరుపుకుంటాం …హోలీని మరింత సంబరంగా జరుపుకుంటాం. ఎందుకంటే అది వసంతాగమనానికి పీఠిక కాబట్టి. అది ప్రకృతి కొత్త అందాలు నింపుకున్నదనటానికి సూచిక కాబట్టి. ఆమని వచ్చే వేళ రంగురంగులతో ముస్తాబవుతున్న అవనిని చూసి మది మురిసిపోతుంది కాబట్టి. ఆ మురిపెంలోనే రంగులు చల్లుకొనాలనిపిస్తుంది కాబట్టి. వనమంతా పందిరి వేసుకున్న పచ్చదనం. మోడువారిన చెట్లు సైతం చిగురులు తొడిగే కాలం. తరువులన్ని రంగుల పూలను తొడుక్కునే మాసం. ప్రకృతి అనేక రంగులతో సింగారించుకునే సమయం. ప్రకృతిలాగే జీవితమూ వర్ణాలతో విరబూయాలని కోరుకుంటోంది హృదయం. పురి విచ్చుకున్న ఆ ఉల్లాసమే రంగుల పర్వదినం. ఆ వసంతరాగాలాపనే హోలీ వర్ణం. అది మన సంస్కృతిలో ఓ భాగం. చమ్మకేళిల సరాగం. ఏడురంగుల మేళకర్త రాగం. మన ఇంటి సంబరం. మన వాడ సంతోషం. మన దేశం సంప్రదాయం. సమస్త భారతావని సప్తవర్ణ శోభితమయ్యే ఆనందోత్సవం..
రుతువుల్లో వసంతరుతువును నేను అని చెప్పుకున్నాడు గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు.. నిజంగానే ఆరురుతువుల్లో వసంతానికి సాటి మరోటి లేదు. ఆమని వచ్చిన వేళ అవని ఎంతగానో మురిసిపోతుంది. మైమర్చిపోతుంది. ఉత్సహపడుతుంది. ఉత్సవం చేసుకుంటుంది. ఆ సృష్టికర్త ఎంత రసికుడు కాకపోతే ఇన్నేసి రంగులను ఎందుకిస్తాడు.? .? ఆ రంగులతో ఆడుకోడానికి ఇన్నేసి వేడుకలు ఎందుకు ఇస్తాడు..? రాలిపడిన జీర్ణపత్రాల చోటే కొత్త చిగురును ఎందుకిస్తాడు.? రంగుల పూలకు పరిమళాలను ఎందుకు ఇస్తాడు..? ప్రౌఢ కోయిలలకు పంచమ స్వరాలను ఎందుకిస్తాడు..? అన్నింటిని గుదిగుచ్చి అనుభూతులను ఆస్వాదించడానికి మనకు వసంతాన్ని ఎందుకు ఇస్తాడు..? నిజమే.. వసంతం ఓ అనిర్వచనీయమైన అనుభవం. ఓ శ్రావ్యమైన సంగీతం. ఓ ఆహ్లాదపరిచే మధురగీతం…!
చిగురించే మోదుగులు. పూసే గురువిందలు. వేసే మొల్లల మొగ్గలు. సాగే మల్లెల కొనలు.. రాలే పొగడ పుప్పొడి రేణువులు. కురిసే గోగు తేనెలు. గుత్తులెత్తే గోరంటలు . ఊరికే అనలేదు వసంతాన్ని రుతువులకే రారాజని! మధుమాస వేళలో జరిగే వసంతోత్సవాన్ని భారతదేశమంతటా ఘనంగా జరుపుకుంది. జరుపుకుంటోంది. జరుపుకోబోతున్నది…రంగుల కేళీ అయ్యాక నేలను చూస్తే ఓ ప్రముఖ చిత్రకారుడు గీసిన మోడ్రన్ పెయింటింగ్‌లా కనిపిస్తుంది. విప్పారిన ఆనందంతో గుప్పుకునే రంగులు అసంకల్పితంగానే వర్ణచిత్రాన్ని గీస్తాయి. హోలీని ఉత్తర భారతీయులు చాలా గొప్పగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని మధుర అయితే మరింత కలర్‌ఫుల్‌గా జరుగుతుంది. శ్రీకృష్ణ లీలలకు ప్రసిద్ధి చెందిన మధురలో హోలీ సందర్భంగా రాధాకృష్ణుల ఆలయాలను చక్కగా ముస్తాబు చేస్తారు. అక్కడికి జనం సమూహాలుగా చేరుకుంటారు. నృత్యగానాలతో ఆనందిస్తారు. హోలీ రోజున భంగ్ సేవించడం ఇక్కడి సంప్రదాయం.
హోలీ రోజు అసంకల్పితంగానే ప్రకృతి రంగులను అద్దుకుంటుంది. సప్త వర్ణ శోభితమవుతుంది.. అప్పటి వరకు రాగి రంగులో ఆకుల చిగురుతనం ఆకుపచ్చగా మారుతుంది.. చిన్నా, పెద్దా, కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా అందరూ రంగుల్లో మునిగిపోతారు. చిన్నారుల మోములు రంగులతో విచ్చుకుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో బర్సానా అనే పట్టణముంది. మధురకు జస్ట్ 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ పట్టణం. శ్రీకృష్ణుడి ప్రియురాలు రాధ జన్మించిన ప్రాంతంగా భావిస్తారు స్థానికులు. ఇక్కడ ప్రతి పురుషుడూ కృష్ణుడిగా, ప్రతి స్త్రీ రాధగా భావించుకుంటారు. ఇక్కడ హోలీ విచిత్రంగా, విభిన్నంగా జరుగుతుంటుంది. పండుగ రోజున స్త్రీలు కర్రలు పుచ్చుకుని పురుషుల వెంటపడతారు. వెంటపడటమే కాదు కర్రలతో కొడతారు. మగవాళ్లు పాపం డాలుతో కర్ర దెబ్బలను అడ్డుకుంటారు. ఈ వేడుకను లఠ్‌మార్ హోలీ అంటారు. లఠ్ అంటే లాఠీ అన్నమాట. ఈ కొట్టడాలు, డాలుతో అడ్డుకోవడాలు అన్నీ సరదా కోసమే! అసలీ సరదా వెనుక ఓ పురాణగాధ ఉంది. చిన్ని కృష్ణుడు ఎంత అల్లరివాడో తెలుసుగా..! ఓనాడు రాధ గ్రామానికి వెళ్లి అక్కడ రాధతో పాటు ఆమె స్నేహితురాళ్లను ఆటపట్టించాడట! అప్పటికే వెన్నదొంగ అల్లరితో సతమతమైన బర్సానా మహిళలు కర్రలతో కృష్ణుడి వెంట పడ్డారట.. అప్పట్నుంచి ఈ పండుగను ఇలా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది.. ఇప్పటికీ పక్కనే ఉన్న కృష్ణుడి గ్రామం నంద్‌గావ్ నుంచి మగవాళ్లు హోలీ ఆడేందుకు బర్సానాకు వస్తారు.. రెచ్చగొట్టే పాటలు పాడుతూ యువతులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు.. ఆ వెంటనే ఆడవాళ్ల చేత లాఠీ దెబ్బలు తింటారు. ఆడవాళ్లు కూడా చాలా జాగ్రత్తగా డాలు మీదనే కర్ర దెబ్బలు వేస్తారు కానీ.. పొరపాటున కూడా మగవాళ్లను కొట్టరు.. గమ్మత్తేమిటంటే బర్సానా అత్తగార్లు తమ కోడళ్లకు హోలీకి నెల రోజుల ముందు నుంచి పౌష్టిక ఆహారం పెడతారు! ఎందుకూ అంటే మగవాళ్లను బాగా కొట్టేందుకు! ఇక్కడ కొట్టడమంటే తమ ప్రేమను వ్యక్తపర్చడమే గానీ మరోటి కాదని గ్రామస్తులు నవ్వుతూ చెబుతారు.
బృందావన్‌లో హోలీ రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఫాల్గుణమాసం చివరి రోజున వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ వేడుకను సంవత్సర ముగింపుగా కూడా భావిస్తారు. పూర్ణిమకు ముందు ప్రజలందరి సమక్షంలో పురోహితుడు మంటను వెలిగించి, శుభాకాంక్షలు తెలుపుతాడు. తరువాత రోజు ఈ పండగను అంతా కలిసి రంగులతో ఉల్లాసంగా జరుపుకుంటారు. ఇక్కడే మరో అపురూపఘట్టం ఆవిష్కృతమవుతుంది. వితంతువుల మోముల్లో రంగులు పూయిస్తుంది. ఆమని మళ్లీ వారిని ఆప్యాయంగా పలకరిస్తుంది. మోడువారిని వారి జీవితాల్లో వసంతకేళి ఆనందోత్సవాలను నింపుతుంది. దేశంలో మరెక్కడా జరగని సంబరమిది! ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, ఆడిపాడుతూ కేరింతలు కొడుతూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. రంగులతో పాటు రంగురంగుల పూలనూ చల్లుకుంటారు. దూరమైన పసుపు కుంకుమలే కాదు. అవనిలోని అన్ని రంగులు ఆ రోజు వారి సంతోషంలో భాగం పంచుకుంటాయి..
రుతువులన్నింటిలో వసంతానిదే ప్రత్యేక స్థానం.. ఆరు రుతువులు ఆమనిలా సాగాలని కోరుకునేది అందుకే! కొమ్మలన్నీ రంగురంగుల విరులను తురుముకునే రుతువు ఇది! ఆమని రాకతో ప్రకృతే పరవశించిపోతున్నప్పుడు మానవమాత్రులం మనమెంత! అందుకే ఆమని రాకను రంగులతో స్వాగతం పలుకుతున్నాం.. వసంతోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక జైపూర్‌లో అయితే చెప్పనే అక్కర్లేదు. మామూలుగానే అదో పర్యాటక ప్రాంతం. ఇక హోలీ పండుగ రోజైతే పర్యాటకులతో నగరం కిక్కిరిసిపోతుంది.. కారణం హోలీతో పాటు అక్కడ ఏనుగుల పండుగ కూడా జరుగుతుంది కాబట్టి. ఈ ఒక్క రోజు మాత్రం అది పింక్ సిటీ కాదు. రంగుల నగరం. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో చాలా వినూత్నంగా జరుపుకుంటారీ పండుగను ఆలయ గర్భగుడిలోనే రంగులు చల్లుకుని సంబరాలు చేసుకుంటారు. చారిత్రక మహంకాళీ దేవాలయం లోపలా వెలుపలా రంగులు విరజిమ్ముతాయి.. గర్భగుడిలో శివలింగానికి అభిషేకాలు చేస్తూనే రంగులు చల్లుకుంటారు.. ఆనందతాండవాలు చేస్తారు. డోల్ పూర్ణమనాడు బెంగాలీవాసుల సంబరమే సంబరం! నెల రోజుల నుంచే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉంటారు.. ఉదయం యువతీయువకులు కుంకుమపువ్వు రంగు దుస్తులను ధరిస్తారు. మెడలో సుగంధభరితమైన హారాలు వేసుకుంటారు. ఆటపాటలు సరేసరి! హోలీ పండుగను డోల్ జాత్ర, స్వింగ్ పండుగ అని కూడా పిలుచుకుంటారు. రాధాకృష్ణుల ప్రతిమలను అందంగా అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు.. రవీంద్రనాథ్ టాగూర్ శాంతినికేతన్‌లో అయితే హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతాయి.
ఫాల్గుణ మాసం. పున్నమి రాత్రి. ఇంకా వేడెక్కని ఓ మోస్తరు చల్లటి గాలులు. ఇంతకు మించిన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందా? ప్రతి రాత్రి వసంతరాత్రి అయితే ఎంత బాగుంటుంది.? ఈ ఆకాంక్ష మణిపూర్‌లో హోలీ వేడుకలు చూసిన వారివ్వరికైనా కలిగి తీరుతుంది. మణిపూర్‌లో ఆరు రోజుల పాటు హోలీ పండుగ జరుగుతుంది. పౌర్ణమి రోజు రాత్రి డోలు వాయిద్యాలు, జానపద పాటలు, సంప్రదాయ నృత్యాలతో ప్రజలు వేడుక చేసుకుంటారు. మణిపూర్ క్యాలెండర్‌లో చివరి నెల అయిన లామ్తాలో వచ్చే నిండు పున్నమినే హోలీగా జరుపుకుంటారు. హోలీని ఇక్కడ యావ్‌షాంగ్‌గా జరుపుకుంటారు. మిగతా ప్రాంతాల్లో హోలికా దహనం ఉన్నట్టుగానే ఇక్కడా ఓ చెడును అగ్నికి ఆహుతి ఇచ్చే సంప్రదాయం ఉంది. వెదురుతో నిర్మించిన ఓ పర్ణశాల వంటి పాకను దహనం చేస్తారు.. దీన్ని వారు యావ్‌షాంగ్ మై తాబాగా పిలుచుకుంటారు. రంగుల పండుగకు ఇది నాంది. ఇక్కడ్నుంచే ఆరు రోజుల పాటు హోలీ వేడుకలు జరుగుతాయి. అయితే వీరు జరుపుకునే హోలీ కాసింత భిన్నంగా ఉంటుంది. అదే రోజు ఉదయం చిన్నారు ఇళ్లిళ్లూ తిరిగి బియ్యం…కాయగూరలు సేకరిస్తారు. మరుసటి రోజు పిల్లలు తమ ఇరుగుపొరుగు ఇళ్లకు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలుపుతారు. వారిచ్చే డబ్బు, కానుకలను స్వీకరిస్తారు. మణిపూర్ వైష్ణవుల సంబరమే సంబరం! అక్కడి వైష్ణవాలయాన్ని కొత్త కళను సంతరించుకుంటాయి. పెద్దలంతా వైష్ణవ భజనలో మునిగిపోతారు. ఆరో రోజు విజయ్ గోవింద ప్రాంగణంలో హాలంగర్‌ను నిర్వహిస్తారు. ఇది కూడా వారికి ఓ పండుగే! నిజానికి ఇది గొప్ప పండుగ. అన్ని కులాలను ఒక్కటిగా చేసే పండుగ. బీద గొప్ప అన్న తేడాలు లేని పండుగ. అందరూ ఒక్కటై ఆనందంగా జరుపుకునే పండుగ. యువతీ యువకులకైతే చెప్పలేనంత ఆనందం. వివిధ ప్రాంతాల్లో యువతీయువకులు చేసే తబల్ చంగ్బా నృత్యం అందరిని ఆకట్టుకుంటుంది..
హోలీ అంటే రంగుల పర్వదినం. చిత్రవర్ణాలతో పరవశించిపోయే విచిత్రం. అదో తీయని అనుభూతి. ప్రకృతిలోని రంగులన్నీ జీవితం నిండా విరబూయాలని మనిషి చేసుకునే వినతి. దేశమంతా భాసిల్లే రంగుల కేళి ఇప్పుడు ఎల్లలు దాటింది. సముద్రాలు దాటిన మన సంస్కృతి ఇప్పుడు విదేశాల్లోనూ వర్ణమయ శోభను అందిస్తోంది. అమెరికాలో హోలీ సందడిని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. అతిశయోక్తి కాదు కానీ అసలు ఈ భూమ్మీద అంత గొప్పగా మరెక్కడా హోలీ వేడుకలు జరగవు! నమ్మి తీరాల్సిన నిజం! అమెరికాలోని ఉతాలో ఓ పెద్ద ఇస్కాన్ టెంపుల్ ఉంది. అక్కడున్న రాధాకృష్ణ మందిరంలో ప్రతి ఏటా రంగుల పండుగ జరుగుతుంటుంది. హోలీ సెలెబ్రెషన్స్ కోసమే దాదాపు లక్ష మంది సమూహం అక్కడికి చేరుకుంటుంది. అంతమంది ఒక్కసారి రంగులు చల్లుకోవడం ఓ అద్భుత దృశ్యం. నిర్మలంగా ఉండే నీలాకాశం ఒక్కసారిగా రంగులను అద్దుకుంటుంది. వేలాది ఇంద్రధనుస్సులు నేలరాలిపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ మనలాగ ఏ రంగు పడిదే ఆ రంగు వాడరు. శరీరానికి ఎలాంటి హానీ చేయని రంగులనే ఉపయోగిస్తారు.. ఇలాంటి జాగ్రత్తలన్ని ఆలయ నిర్వాహకులే తీసుకుంటారు.. ప్రకృతి సిద్ధమైన రంగులనే ఎక్కువగా వాడతారు.
ఉత్తరాదితో పోల్చితే దక్షిణ భారతదేశంలో రంగుల హంగామా కాసింత తక్కువే! కర్నాటకలోని హంపిలో మాత్రం హోలీ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ వేడుకలను చూసేందుకు విదేశీ యాత్రికులు కూడా వస్తారు.. రంగులతో ఆటలు అయ్యాక అందరూ తుంగభద్రలో స్నానం చేస్తారు. హిందూ దేశమైన నేపాల్‌లో హోలీని ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడాన్ని లోలా అంటారు. హోలీకి ముందు రోజు పొడవైన వెదురు కర్రలకు రంగురంగుల వస్ర్తాలను చుడతారు. మనకు కాముడైతే వారికి లింగో. అనంతరం లింగోను దహనం చేస్తారు.. వెదురు కర్రల్లో రంగునీళ్లు నింపుకొని ప్రజలు ఒకరిపై ఒకరు చల్లుకుంటారు.. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. అన్నట్టు హోలీ పండుగ రోజు స్కూళ్లు. ఆఫీసులు ఏమీ ఉండవు. ఎందుకంటే హోలీ అక్కడ నేషనల్ హాలీడే కాబట్టి!
ఫిజీలో కూడా భారత సంతతి వారెక్కువే! అక్కడ కూడా హోలీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హోలీ రోజు అక్కడ సెలవు లేకపోయినా ఆఫీసులకు సెలవులు పెట్టేసి పనులు ఎగ్గొట్టేసి స్కూళ్లకు డుమ్మా కొట్టేసి పండుగ సంబరాల్లో మునిగి తేలుతారు. జానపదాలను శ్రావ్యంగా ఆలపిస్తూ పండుగకు మరింత శోభను తెస్తారు. ఈ పాటలను ఫాగ్ గాయన్ అని పిలుస్తారు. ఫాగన్‌ను ఫాల్గున్ అని కూడా అంటారు.. మన క్యాలెండర్‌లో వచ్చే చివరి మాసం ఫాల్గునమే! వసంతానికి స్వాగతం చెప్పే మాసం ఇదే! రసస్వాదనను కలిగించే మాసం కూడా ఇదే! పరిమళభరితమైన చూర్ణాలను ఒళ్లంతా పూసుకుని రంగులు జల్లుకుంటారు. హిందువులు ఉండే పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, సురినామ్, గయానా… ట్రినిడాడ్… మారిషస్ దేశాల్లోనూ హోలీ అట్టహాసంగా జరుగుతుంది. ఆ మాటకొస్తే హిందువులే కాదు. ప్రపంచంలో అందరూ ఇప్పుడు హోలీ పేరిట రంగులు చల్లుకోవడం మొదలు పెట్టారు..
Read Also….