
ప్రస్తుత రోజుల్లో పిల్లలకు స్కూల్, టీవీ, వీడియో గేమ్స్ మాత్రమే కాదు.. కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి ఒక ప్రదేశం కూడా అవసరం. ధ్యానం అంటే వాళ్లని ఫోర్స్ చేసి కూర్చోబెట్టడం కాదు.. బయటి ప్రపంచం గందరగోళంగా ఉన్నప్పుడు మనసులో ఒక శాంతివంతమైన స్పేస్‌ని క్రియేట్ చేసుకోవడం. పిల్లలకు ఇది చాలా సింపుల్, పవర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. పిల్లలు రోజూ మెడిటేషన్ అలవాటు చేసుకోవడానికి 10 బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలు చాలా ఎమోషనల్ గా ఉంటారు. కోపం, బాధ, ఆందోళన లాంటి భావాలను ఎలా హ్యాండిల్ చేయాలో వారికి తెలియకపోవచ్చు. ధ్యానం వాళ్లు ఆగి ఆ ఫీలింగ్‌ని గమనించేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ భావాలు తాత్కాలికం అని.. అవి వస్తూ పోతూ ఉంటాయని వాళ్లు అర్థం చేసుకుంటారు.
వీడియో గేమ్స్, సోషల్ మీడియా, వీడియోలు పిల్లల ఫోకస్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ధ్యానం ఒక విషయంపై మనసుని తిరిగి ఫోకస్ చేసే టూల్ లా పని చేస్తుంది. రోజూ కాసేపు శ్వాసపై ధ్యాస పెట్టడం వల్ల వాళ్ల చదువులో, పనుల్లో ఏకాగ్రత పెరుగుతుంది.
పిల్లలకు కూడా చదువు, పరీక్షలు, స్నేహితులు వంటి వాటి వల్ల ఒత్తిడి కలుగుతుంది. అయితే ధ్యానం వల్ల వారి శరీరం రిలాక్స్ అవుతుంది. దీని వల్ల శ్వాస, గుండె కొట్టుకోవడం సాధారణ స్థితికి వస్తాయి. ఈ అలవాటును కొనసాగించడం ద్వారా.. పిల్లలు తాము ఎప్పుడు ఒత్తిడికి గురవుతున్నారో గుర్తించి ఎలా ప్రశాంతంగా ఉండాలో త్వరగా నేర్చుకుంటారు.
పిల్లలు సరిగ్గా ఎదగాలంటే మంచి నిద్ర చాలా అవసరం. నిద్రపోయే ముందు కాసేపు ధ్యానం లేదా శ్వాస వ్యాయామం చేయడం వల్ల మనసు రిలాక్స్ అవుతుంది. దీని వల్ల రేపటి టెన్షన్స్ తగ్గి తొందరగా నిద్ర పడుతుంది.
ధ్యానం పిల్లలని తమ ఆలోచనలు, ఫీలింగ్స్, శ్వాసని గమనించేలా చేస్తుంది. ఇలా లోపల జరిగే విషయాలపై అవగాహన పెరగడం వల్ల వాళ్లలో దయ, సానుభూతి పెరుగుతాయి. మొదట తమపై, తర్వాత ఇతరులపై కూడా దయతో ఉండటం నేర్చుకుంటారు.
పిల్లల మెదడు ఎప్పుడూ ఎదుగుతూ ఉంటుంది. ధ్యానం ఫోకస్, మెమరీకి సంబంధించిన నరాలను స్ట్రాంగ్‌గా చేస్తుంది. దీని వల్ల పాఠాలు బాగా గుర్తుండడం చదివేటప్పుడు గందరగోళం తగ్గి నేర్చుకున్న విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది.
పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం, ఆటల్లో ఓడిపోవడం లాంటి సవాళ్లు పిల్లల జీవితంలో భాగం. ధ్యానం చేయడం వల్ల కష్టాలు వచ్చినప్పుడు తొందరపడకుండా.. కాసేపు ఆగి ఆలోచించి, ధైర్యంగా ముందుకు వెళ్లడం నేర్చుకుంటారు.
చిన్నప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. ధ్యానం వల్ల ఏదైనా చేసే ముందు ఒక్క శ్వాస తీసుకోవడం అలవాటవుతుంది. దీని వల్ల కోపాన్ని వదిలి దయతో ఉండటం అలవాటు అవుతుంది.
చాలా మంది పిల్లలు నేను దేనికీ పనికిరాను, నన్ను ఎవరూ ఇష్టపడరు వంటి ప్రతికూల ఆలోచనలతో ఇబ్బంది పడుతుంటారు. ధ్యానం చేయడం వల్ల ఆ ఆలోచనలు కేవలం తాత్కాలికమైనవేనని.. అవి నిజం కావని పిల్లలు అర్థం చేసుకుంటారు. దీని వల్ల వారిలో శాశ్వతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఈ ప్రపంచం ఎప్పుడూ వేగంగా, గందరగోళంగా ఉంటుంది. అలాంటి సమయంలో ధ్యానం పిల్లలకు ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉండే సమయాన్ని అందిస్తుంది. ఫోన్ లేదా టీవీ లాంటివి లేకుండా.. కేవలం తమ శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా ప్రశాంతంగా ఉండటాన్ని నేర్పిస్తుంది. దీని వల్ల వారు నిశ్శబ్దానికి ఉన్న విలువను అర్థం చేసుకుంటారు.