Andhra News: రూ.1000 కోసం దారుణహత్య.. కన్నతల్లి ఒడిలోనే కన్ను మూసిన యువకుడు

పూసపాటిరేగ మండలం ఎరుకొండలో గొర్లె పవన్, బొంతు అప్పలనాయుడులు చిన్ననాటి నుంచి స్నేహితులు. కలిసిమెలిసి తిరిగేవారు. ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. ఏ పని చేసినా కలిసే చేసేవారు. అందులో భాగంగానే ఇద్దరు కలిసి పెయింట్ వర్క్ ను వృత్తిగా ఎంచుకున్నారు. ఇద్దరూ కలిసి చిన్నపాటి పెయింట్ కాంట్రాక్ట్ పనులు ఒప్పుకొని చేస్తుంటారు. ఈ క్రమంలో..

Andhra News: రూ.1000 కోసం దారుణహత్య.. కన్నతల్లి ఒడిలోనే కన్ను మూసిన యువకుడు
Ap Crime News
Follow us
G Koteswara Rao

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 08, 2025 | 9:19 AM

ఇద్దరు కలిసి చేసిన పనిలో.. తనకు వెయ్యి రూపాయలు తక్కువ వచ్చాయని ఆగ్రహంతో చిరకాల స్నేహితుడిని కత్తితో పొడిచి చంపిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. వెయ్యి రూపాయల కోసం జరిగిన దారుణహత్య జిల్లాలో సంచలనంగా మారింది. పూసపాటిరేగ మండలం ఎరుకొండలో గొర్లె పవన్, బొంతు అప్పలనాయుడులు చిన్ననాటి నుంచి స్నేహితులు. కలిసిమెలిసి తిరిగేవారు. ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. ఏ పని చేసినా కలిసే చేసేవారు. అందులో భాగంగానే ఇద్దరు కలిసి పెయింట్ వర్క్ ను వృత్తిగా ఎంచుకున్నారు. ఇద్దరూ కలిసి చిన్నపాటి పెయింట్ కాంట్రాక్ట్ పనులు ఒప్పుకొని చేస్తుంటారు. ఆ క్రమంలోనే ప్రక్క గ్రామంలో ఒక పెయింట్ వర్క్ కాంట్రాక్ట్ కు తీసుకున్నారు. ఇద్దరూ కలిసి ఆ పని పూర్తి చేసి యజమాని వద్ద డబ్బులు తీసుకున్నారు. అనంతరం వచ్చిన డబ్బులు ఇద్దరు పంచుకున్నారు.

అలా పంచుకున్న క్రమంలో బొంతు అప్పలనాయుడుకి వెయ్యి రూపాయలు తక్కువ వచ్చాయి. ఇద్దరికి చేరి సమానంగా రావలసిన డబ్బులు నాకు వెయ్యి రూపాయలు తక్కువ ఎలా వస్తాయని గొడవ పడ్డారు. అలా గొడవ పడుతూనే కొప్పెర్ల వద్ద ఉన్న వైన్ షాప్ లో ఇద్దరూ మద్యం కొనుగోలు చేసి మద్యం తాగారు.. మద్యం తాగుతూనే ఇద్దరూ గొడవ పడ్డారు. చివరికి రాత్రి 10:30 నిమిషాల ప్రాంతంలో ఇద్దరు కలిసి స్వగ్రామం ఎరుకొండకు చేరుకున్నారు. అక్కడ పవన్ ఇంటి వద్దకు వచ్చే సరికి అప్పలనాయుడు మరోసారి పవన్ తో గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో అప్పలనాయుడు కోపంతో తన దగ్గర ఉన్న పదునైన ఆయుధంతో పవన్ ఛాతీ పై మూడు సార్లు పొడిచాడు. దీంతో పవన్ నొప్పి భరించలేక పెద్దగా అరిచాడు. ఆ అరుపులు విన్న పవన్ తల్లి ఇంట్లో నుండి పరుగుపరుగున బయటకు వచ్చింది. దీంతో పవన్ తల్లిని చూసిన అప్పలనాయుడు భయంతో పారిపోయాడు. వెంటనే పరిస్థితి గమనించిన పవన్ తల్లి తన కుమారుడిని ఓదారుస్తూ ఒడిలోకి తీసుకొని సపర్యలు చేయడం ప్రారంభించింది. పరిస్థితి గమనించిన చుట్టుపక్కల వారు అంబులెన్స్ కోసం ఫోన్ చేయడం ప్రారంభించారు. ఇంతలో తీవ్ర రక్తస్రావం అయ్యి అమ్మఒడిలోనే కన్నుమూశాడు పవన్.

తన ఒడిలోనే రక్తం కక్కుతూ కన్నుమూసిన కొడుకును చూసిన తల్లి గుండెలవిసేలా రోదించింది.. ఆమె రోదనలు విన్న అందరూ కన్నీరు పెట్టారు.. స్థానికుల సమాచారంతో రంగప్రవేశం చేసిన భోగాపురం సీఐ రామకృష్ణ క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. వెయ్యి రూపాయల కోసం జరిగిన యువకుడి హత్య జిల్లాలో సంచలనంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..