Worst Traffic City In India: నగరాల్లో పెరుగుతున్న జనాభా రీత్యా వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలోని ప్రముఖ నగరాల్లో ప్రతీ ఏడాది పెరుగుతున్న వాహనాలు కారణంగా అనేక ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఒక ఏడాదిలో అమెరికా, చైనా కంటే మన దేశంలోనే అధికంగా కార్ల అమ్మకాలు జరిగాయని ఓ సర్వే చెబుతోంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ ఉన్న నగరాలు గుర్తించే పనిలో భాగంగా ప్రముఖ వాహనరంగ సంస్థ టామ్ టామ్ చేపట్టిన సర్వేలో భారత్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సుమారు 57 దేశాల్లోని 416 నగరాల్లోని ట్రాఫిక్ రద్దీపై పూర్తి నివేదికను సిద్ధం చేసిన ఈ సంస్థ భారతదేశం భారీ ట్రాఫిక్‌తో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోందని పేర్కొంది. అంతేకాక టాప్ 10 నగరాల లిస్టులో భారత్ నుంచే 4 నగరాలు ఉండటం విశేషం.
ట్రాఫిక్ రద్దీలో ముంబై 4వ స్థానంలో ఉండగా పూణే 5, బెంగళూరు 3, ఢిల్లీ 8 స్థానంలో నిలిచాయి. ఈ నివేదిక ప్రకారం బెంగళూరు వాసులు అత్యధికంగా 71 శాతం తమ సమయాన్ని ట్రాఫిక్‌లోనే గడుపుతున్నారని తెలుస్తోంది. మరోవైపు టాప్ 10 లిస్టులో మనీలా, బొగోటా, మాస్కో, లిమా, ఇస్తాంబుల్, జకార్తా నగరాలున్నాయి.