
House rent: ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో అద్దె చెల్లించలేదన్న కోపంతో దంపతులను కాల్చి చంపాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌ఘర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అహిరౌలాకు చెందిన సంజీవ్.. కోత్వాలీ సిటీలో ఆటో విడి భాగాలు అమ్మే షాపును నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా.. రాకేష్ రాయ్ అనే వ్యక్తికి చెందిన ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా షాపు తెరవక పోవటంతో చేతిలో డబ్బులేక సంజయ్ ఇంటి అద్దె చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇంటి యజమాని రాయ్ అతడ్ని అద్దె ఇవ్వాలని అడిగాడు. అతడు డబ్బులు లేవని చెప్పటంతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్యా కొద్దిసేపు మాటల యుద్దం నడిచింది. దీంతో ఆగ్రహానికి గురైన రాయ్ తుపాకితో విచక్షణా రహితంగా సంజయ్, అతడి భార్యపై కాల్పులు జరిపాడు.
అయితే.. అప్రమత్తమైన స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆ వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తీవ్రంగా గాయపడటం కారణంగా వారు చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.