దేశవ్యాప్తంగా ఇంతకాలం కరోనా వైరస్ కలవరపెడితే, తాజాగా కొత్త రకం వైరస్ గుబులురేపుతోంది. యూకే రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. శనివారం నాటికి కొత్త రకం వైరస్ కేసుల సంఖ్య 90కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త రకం వైరస్ బారిన పడిన వారందరిని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, వారితో పాటు ప్రయాణించిన వారిని కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం పాజిటివ్ వర్చిన వారి కుటుంబ సభ్యులను గుర్తించే పనిలోపడ్డారు.
బ్రిటన్‌లో కరోనా వైరస్ మార్పు చెంది కొత్త రకం వైరస్‌గా రూపాంతరం చెందింది. ఈ వైరస్..అక్కడ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ అక్కడ కొత్త పాజిటివ్ కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా కొత్త రకం వైరస్ విస్తరిస్తోంది. అమెరికా, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లోనూ ఈ కొత్త రకం వైరస్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు, భారత్-యూకే మధ్య నడిచే విమాన సర్వీసులపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని భారత ప్రభుత్వం ఎత్తివేసింది.
మరోవైపు, బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే, విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. తమ ప్రజలను రక్షించుకునేందుకు యూకే నుంచి వస్తోన్న ప్రయాణికుల విషయంలో నిబంధనలు కఠినతరం చేస్తున్నామని అయా ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి.