కరోనా పేరుతో థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వకపోతే భవిష్యత్తులో ఉద్యమం వస్తుందని సినీ నిర్మాత, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ నట్టికుమార్ అన్నారు. అన్ లాక్ లో భాగంగా అన్నింటికీ పర్మిషన్లు ఇచ్చారు కానీ ధియేటర్ లకి ఇస్తే వచ్చే ప్రమాదం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా థియేటర్స్ ఓపెన్ చేయకపోవడం వల్ల సినిమా హాల్స్ దెబ్బతింటున్నాయని, కొన్ని థియేటర్స్‌లో ఫర్నీచర్ నాశనం అవుతుందని, మరికొన్ని థియేటర్స్‌లలో ఫర్నీచర్ చోరీకి గురైన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు. థియేటర్లు మూతపడడం వలన చాలా మంది కార్మికులు రోడ్డు మీద పడ్డారని, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ధియేటర్ లు మూతపడడంతో కొన్ని సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నారని.. అయితే ఓటీటీ వేదికగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాలు కచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని, వారికి ఇలాంటి స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన ఘనత కూడా థియేటర్లకే దక్కుతుందని అన్నారు. థియేటర్ల రీఓపెన్ అంశంపై టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వాలతో మాట్లాడాలని ఆయన కోరారు.