జాత్యాహంకారాన్ని బయటపెట్టిన యువతికి ప్రతిష్టాత్మక అవార్డు

|

Oct 29, 2020 | 7:11 AM

అమెరికా శ్వేతజాతి దురహంకారాన్ని బయటపెట్టిన యువతికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.

జాత్యాహంకారాన్ని బయటపెట్టిన యువతికి ప్రతిష్టాత్మక అవార్డు
Follow us on

అమెరికా శ్వేతజాతి దురహంకారాన్ని బయటపెట్టిన యువతికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పై పోలీసుల దాడి ఘటనను చిత్రీకరించిన యువతికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కనుంది. ఈ ఏడాది మే 25న మిన్నెపొలిస్‌లో తెల్ల పోలీసు అధికారుల చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన విషయం తెలిసిందే. జార్జ్ ఫ్లాయిడ్ మెడపై తెల్ల పోలీసు దాదాపు పది నిమిషాల పాటు మోకాళ్లు పెట్టడంతో ఊపిరాడక అతడు మరణించాడు. అయితే, ఈ ఘటనను డార్నెల్లా ఫ్రాజియర్(17) అనే యువతి తన ఫోన్‌లో వీడియో తీసింది. ‘నేను చూస్తున్న ఈ దారుణమైన సంఘటనను ప్రపంచం మొత్తం చూడాలి. వెలుగులోకి రాకుండా ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి’ అని జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన మరుసటి రోజు డార్నెల్లా ఇంటర్నెట్ లో షేర్ చేసింది.

ఈ వీడియో బయటకు రావడంతో అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా శ్వేతజాతి దురహంకారంపై నిరసనలు వెల్లువెత్తాయి. అంతలా ఈ వీడియో నెటిజన్లను కదిలించింది. ఇక ఇంతటి సాహసం చేసినందుకు గాను డార్నెల్లాకు బెనెన్‌సన్ కరేజియస్ సాహసోపేత అవార్డును అందజేయనున్నట్టు పెన్ అమెరికా అనే ప్రముఖ సాహిత్య, మానవ హక్కుల సంస్థ బుధవారం వెల్లడించింది. కేవలం ధైర్యంతో, ఒక ఫోన్ ద్వారా డార్నెల్లా అమెరికా చరిత్రనే మార్చేసిందని, జాత్యాహంకారాన్ని అంతం చేయాలని ఉద్యమం చేస్తోందని పెన్ సీఈఓ సుజాన్ నోసెల్ ఓ ప్రకటనలో తెలిపారు.