Ram Mandir donation: ప్రతి హిందువుని అయోధ్యలోని రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాయి. తాజాగా మందిర నిర్మాణ నిథి సేకరణ కార్యక్రమం ఇవాళ్టి నుంచి తెలంగాణలో ప్రారంభమైంది. బోరబండలో జరిగిన జనజాగరణ నిధి సేకరణ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేలా నిధి సేకరణ చేపట్టామని తెలిపారు. ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రామరాజ్య స్థాపనకు ప్రతీకగా ఈ కార్యక్రమం జరగబోతోందన్నారు. దేశ సంస్కృతి, మూలాలను చాటిచెప్పడమే రామ మందిర నిర్మాణం ఉద్దేశమన్నారు.
తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని.. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడిగా నిధి సేకరణలో భాగస్వామి అవుతున్నానని సంజయ్ చెప్పారు. జన జాగరణ నిధి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు 20 రోజులపాటు తెలంగాణాలో జరిగే ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రాలన్ని పాల్గొనబోతున్నాయి. ఈరోజు నుంచి ఫిబ్రవరి 10 వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామజన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ అనే కార్యక్రమం నిర్వహించనున్నారు.
Also Read : థాయిలాండ్ ఓపెన్ నుంచి సాయి ప్రణీత్ ఔట్.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ