బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవుతున్న దాదా… మరో రికార్డును తిరగరాయబోతున్నాడు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఓ భారత క్రికెటర్ అధ్యక్ష పదవి చేపట్టబోతున్నాడు. సుదీర్ఘ చరిత్ర ఉన్న బీసీసీఐకి ఓ క్రికెటర్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో తెలుగు వాడైన విజయనగరం మహారాజు విజయ ఆనంద గజపతిరాజు 1954-56 మధ్య అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన 1936లో భారత్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఈ ఆరు దశాబ్దాల్లో ఏ ఇండియన్ క్రికెటర్ కూడా ఈ అధ్యక్ష పదవి చేపట్టలేదు. అయితే గతంలో మాజీ టీమిండియా క్రికెటర్లు సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్ మాత్రం కొంతకాలం బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షులుగా పనిచేశారు.
ఇక అధ్యక్ష పదవి కోసం గంగూలీ నామినేషన్ దాఖలు చేయగా.. కార్యదర్శి పదవి కోసం కేంద్ర హోం శాఖ మంత్రి తనయుడు జై షా, కోశాధికారి పదవి కోసం అరుణ్ ధూమల్ నామినేషన్స్ వేశారు. అయితే గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబరు వరకూ మాత్రమే బీసీసీఐ అధ్యక్ష పదవిలో ఉంటాడు. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం.. బోర్డులో రెండు పర్యాయాలు పదవులు చేపట్టిన తర్వాత సభ్యుడు కనీసం మూడేళ్లు విరామం తీసుకోవాల్సి ఉంటుంది.