రామతీర్థం ఘటనపై విచారణ వేగవంతం.. రంగంలోకి దిగిన సిట్‌ పోలీసులు, మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారని టీడీపీ ఆరోపణ

|

Jan 11, 2021 | 5:19 PM

విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలోని రాముని విగ్రహం ధ్వంసం ఘటన రోజురోజుకి రాజకీయ రంగు పులుముకుంటుండటంతో పోలీసులు దర్యాప్తును..

రామతీర్థం ఘటనపై విచారణ వేగవంతం.. రంగంలోకి దిగిన సిట్‌ పోలీసులు, మమ్మల్నే  టార్గెట్ చేస్తున్నారని టీడీపీ ఆరోపణ
Follow us on

విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలోని రాముని విగ్రహం ధ్వంసం ఘటన రోజురోజుకి రాజకీయ రంగు పులుముకుంటుండటంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఐదు ప్రత్యే క బృందాలతో పాటు ఇంటిలిజెన్స్, సిఐడి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులను పట్టుకోవడంలో ఆలస్యం అయ్యే కొద్దీ ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో పోలీసులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఏ ఒక్క క్లూ వదలకుండా నిందితుల కోసం గాలిస్తున్నారు. రామతీర్థంలో సెక్షన్ 30తో పాటు పోలీస్ యాక్ట్ 1861 ని అమలు చేస్తున్నారు. ఘటన జరిగిన బోడికోండ పైకి ఎవరినీ అనుమతించడంలేదు పోలీసులు. రామతీర్థం జంక్షన్ నుంచి బొడికొండ వరకు అంచెల వారీ వాహనతనిఖీలతో పాటు పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేశారు. ఈ కేసును ప్రభుత్వం సీఐడీ నుంచి సిట్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో సిట్‌ అధికారులు రంగంలోకి దిగారు.

సెల్‌టవర్ సిగ్నల్ ఆధారంగా ఘటన జరిగిన రోజు రాత్రి ఆ ప్రాంతంలో సంచరించిన వారిని విచారిస్తున్నాయి సిట్ దర్యాప్తు బృందాలు. స్థానికుల ప్రమేయం లేకుండా ఘటన జరగదనే అనుమానంతో వారిని కూడా విచారిస్తున్నారు. గతంలో ఆలయాల్లో దొంగతనాలు చేసిన నిందితులను సైతం విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 30 మంది అనుమానితులను విచారించారు. వీరిలో ఎక్కువమంది టీడీపీ స్థానిక నేతలు ఉండటంతో కలకలం రేగుతోంది. అయితే ఒక్కపార్టీకి చెందిన వ్యక్తులనే టార్గెట్ చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. వీటిని ఖండించారు జిల్లా ఎస్పీ రాజకుమారి. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని, త్వరలో నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా సంయమనం పాటించాలని ఎస్పీ కోరారు.