కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా, ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో ఈ వైరస్ తగ్గుముఖం పట్టడంతో.. తిరిగి రవాణా వ్యవస్థను పునరుద్ధరించేందుకు పౌర విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇక కోవిద్-19 వల్ల తీవ్రంగా నష్టపోయిన సంస్థలు.. ఈ సంక్షోభం తర్వాత ఎలా గాడిలో పడాలనే దానిపై ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి.
కాగా.. అమెరికాకు చెందిన దిగ్గజ విమానయాన సంస్థలైన డెల్టా ఎయిర్‌లైన్స్, అమెరికా ఎయిర్‌లైన్స్ గ్రూపు… ప్రయాణికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రత్యేక చర్యలకు ఉపక్రమించాయి. ఇకపై తమ విమానాల్లో ప్రయాణించేవారు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి. జర్నీ పూర్తి అయ్యేవరకు ముఖానికి మాస్క్ తప్పనిసరి అని తెలిపాయి. అయితే, చిన్నపిల్లలకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చాయి. మే 4 నుంచి యూఎస్‌లో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు.. అగ్రరాజ్యాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కరోనా ఇప్పటివరకు 63వేలకు పైగా మందిని పొట్టనబెట్టుకుంది. 10.95 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో అగ్రరాజ్యంలో 2,053 మంది ఈ వైరస్ కారణంగా మృతి చెందినట్టు తెలుస్తోంది.